నల్లమలలో వేటగాళ్లు

24 Aug, 2014 01:51 IST|Sakshi
నల్లమలలో వేటగాళ్లు

పెద్దదోర్నాల : ఇతర ప్రాంతానికి తరలించి సొమ్ము చేసుకునేందుకు ఓ ఇంట్లో సిద్ధంగా ఉంచిన రెండు పులి చర్మాలను ప్రకాశం, కర్నూలు జిల్లాల అటవీశాఖాధికారులు పక్కా సమాచారం మేరకు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మండల పరిధిలోని ఐనముక్కల ఎస్సీ కాలనీలో శనివారం వెలుగు చూసింది. అధికారులు వచ్చి పులి చర్మాలు స్వాధీనం చేసుకోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
 
ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్న నల్లమలలో కొందరు పులులకు మత్తు పెట్టి అవి చనిపోయిన తర్వాత చర్మాలను తీసి అమ్ముకుంటున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన ప్రకాశం, కర్నూలు జిల్లాల పరిధిలోని అటవీశాఖ ఉన్నతాధికారులు విశ్వసనీయ సమాచారంతో ఐనముక్కల ఎస్సీకాలనీలోని ఓ గృహాన్ని చుట్టుముట్టి సోదాలు నిర్వహించారు. ఓ సూట్‌కేసు, మరో గోతంలో చుట్టి ఉంచిన రెండు పులి చర్మాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటి యజమాని గంగమాల  విజయబాబును అదుపులోకి తీసుకున్నారు.
 
సమాచారం మేరకే ఇంటిపై దాడి
కర్నూలు జిల్లా సిద్ధాపురం పరిసర ప్రాంతాల నుంచి దోర్నాల మీదుగా పులిచర్మాలు అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకే ఆ ఇంటిపై దాడులు నిర్వహించి పులి చర్మాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడు గంగమాల విజయబాబును అదుపులోకి తీసుకున్నామని శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఫీల్డ్ డెరైక్టర్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాహుల్ పాండే తెలిపారు.  
 
ఐదేళ్ల ఆడపులితో పాటు రెండేళ్ల మగ పులి పిల్లకు చెందినచర్మాలుగా భావిస్తున్నట్లు చెప్పారు. పులులను ఎలా మట్టుబెడుతున్నారో విచారణలో తేలాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నల్లమల టైగర్ రిజర్వు ఫారెస్ట్‌తో పాటు గుండ్లబ్రహ్మేశ్వరం అభయారణ్యానికి సంబంధించి తాము ఏర్పాటు చేసిన ట్రాప్‌డ్ కెమెరాల్లో 41 పులులు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. ఆ ఫొటోలతో పాటు ప్రస్తుతం తమ వద్ద ఉన్న చర్మాలను బెంగళూరులోని తమ శాఖ టెక్నికల్ కార్యాలయానికి పంపిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పాండే వివరించారు.
 
విష ప్రయోగమేనా?
విష ప్రయోగంతోనే పులులను చంపి ఉంటారని అటవీశాఖ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. పులుల చర్మాలను నిశితంగా పరిశీలించిన అధికారులు.. వాటిపై ఎటువంటి గాయాలు లేకపోవటం వారి అనుమానాలకు బలం చేకూరింది. మారణాయుధాలు ప్రయోగించి ఉంటే చర్మాలపై రంధ్రాలు ఉండేవని, దీని వలన అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి విలువ తక్కువ పలికే అవకాశం ఉన్నందున వేటగాళ్లు వీటిని ఉచ్చుల ద్వార, మారణాయుధాల ద్వారా కాకుండా విషప్రయోగం ద్వారా హతమరచి ఉండొచ్చని చెబుతున్నారు.
 
చర్మాల విలువ రూ.60 లక్షలుపైనే
స్వాధీనం చేసుకున్న పులి చర్మాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.60లక్షలకుపైనే ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. మగపులి పిల్లకు సంబంధించి గోళ్లు లేకపోవడం, ఆడపులికి సంబంధించిన చర్మానికి గోళ్లు అలాగే ఉండటంతో వీటి విలువ భారీగానే ఉంటుందని అటవీశాఖాధికారులు భావిస్తున్నారు. దాడుల్లో ఫ్లయింగ్ స్క్వాడ్, బయోడైవర్శిటీ డీఎఫ్‌ఓ ఖాదర్‌వలి, ఆత్మకూరు డీఎఫ్‌ఓ దివాన్ మైదిన్, మార్కాపురం డీఎఫ్‌ఓ శరవణన్, దోర్నాల రేంజర్ శ్రీనివాస్‌తో పాటు భారీ సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు