పులి‘చింత’ల ఇప్పట్లో తీరేనా!?

29 Nov, 2013 00:44 IST|Sakshi

=ప్రారంభం మరోసారి వాయిదా
 =విజయవాడ సభకు సహకరించని కాంగ్రెస్ నేతలు
 =వచ్చేనెలలో జరుగుతుందని ప్రచారం
 =తెలంగాణపై జీవోఎం నివేదిక నేపథ్యంలో అదీ అనుమానమే..

 
సాక్షి, విజయవాడ : కృష్ణాడెల్టా రైతులకు ఇప్పుడప్పుడే పులి‘చింత’ల తీరే పరిస్థితి కనిపించడంలేదు. ఈనెల 30న సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని హడావుడి చేసినా..తుపానును సాకుగా చూపి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. పులిచింతల ప్రాజెక్టు వద్ద ప్రారంభోత్సవ పైలాన్ ఆవిష్కరించి, విజయవాడలో సభ పెట్టి జాతికి అంకితం చేయనున్నట్లు సీఎం కిరణ్ ఆర్భాటంగా ప్రకటించినా ఆ పార్టీ నాయకులెవరూ పట్టించుకోలేదు. అందువల్లే ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తోంది.
 
నాలుగు జిల్లాల నుంచి జన సమీకరణ : సారథి


విజయవాడ సభకు నాలుగు జిల్లాల నుంచి జనసమీకరణ చేయనున్నట్లు మంత్రి పార్థసారథి మీడియాకు తెలిపారు. అయితే వరుస తుపాన్లతో పంటలు దెబ్బతినడం, అప్పటికి లెహర్ తుపాను ముంచుకొస్తుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో జనసమీకరణ సాధ్యం కాదంటూ నగర నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తేల్చిచె ప్పినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీలోని నేతల సహకారం కొరవడడం వల్లే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడిందనే విషయం విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్ర విభజన ప్రక్రియ, సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన విభేదాలు కూడా ఈ వాయిదా కారణమయ్యాయి.
 
లెహర్ తుపాను వల్లే...

లెహర్ తుపాను కారణంగా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నారని, వచ్చే నెల మొదటివారంలో తేదీ ఖరారు కావచ్చని కృష్ణా డెల్టా సిస్టమ్స్ చీఫ్ ఇంజినీర్ డి. సాంబయ్య ‘సాక్షి’కి తెలిపారు. గుంటూరు జిల్లాలో పైలాన్ ఏర్పాటు చేశామని,  పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న గేట్ల ఏర్పాటు కూడా పూర్తి అవుతున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెలలో ఏ తేదీన ఈ కార్యక్రమం ఉంటుందనేది ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేస్తుందని ఆయన తెలిపారు. అయితే జీఓఎం  తెలంగాణపై జీవోఎం నివేదిక సిద్ధం చేయడం, వచ్చే నెల నాలుగున కేంద్ర కేబినెట్ ముందుకు, ఆ తర్వాత అసెంబ్లీకి రానున్న తరుణంలో పులిచింతల ప్రారంభోత్సవం అనుమానమేనని పలువురు పేర్కొంటున్నారు.
 

మరిన్ని వార్తలు