తీహార్ జైలుకు ఖైదీలను తరలించేందుకు చర్యలు

23 Sep, 2013 00:23 IST|Sakshi
యానాం టౌన్, న్యూస్‌లైన్ : యానాం ప్రత్యేక సబ్‌జైలు, పుదుచ్చేరి కాలాపేట సెంట్రల్ జైల్లో ఉన్న కరడుగట్టిన ఖైదీలను తమిళనాడులోని తిరుచ్చి జైలుకు లేదా తీహార్ జైలుకు పంపేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తమిళనాడు ప్రభుత్వంతో పుదుచ్చేరి ఉన్నతాధికారులు దీనిపై సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. తిరుచ్చి జైలుకు తరలించేందుకు వీలులేని పక్షంలో తీహార్ జైలుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పుదుచ్చేరిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఖైదీల తరలింపుకు చర్యలు చేపట్టింది. ఆగస్ట్ 29న యానాం ప్రత్యేక సబ్ జైలులోకి కొందరు దుండగులు ఒక జీవిత ఖైదీని హతమార్చే ఉద్దేశంతో చొరబడిన విషయం విదితమే. 
 
 పోలీసులు చాకచక్యంగా కొన్ని గంటలలోనే 13 మందిని పట్టుకున్నారు. వీరిని పుదుచ్చేరి కాలాపేట కేంద్ర కారాగారానికి తరలించారు. దాడికి సూత్రధారిగా భావిస్తున్న మరో వ్యక్తిని కర్ణాటకలో పట్టుకున్నారు. యానాం సబ్‌జైల్‌పై దాడి నేపథ్యంలో ఈ జైలులో ఉన్న కరడుగట్టిన ముగ్గురు జీవిత ఖైదీలను వేరే ప్రాంతానికి తరలించాలని యానాం ప్రజలు కోరారు. వీరు ఇక్కడే ఉంటే యానాం ప్రశాంతవాతావరణానికి భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు దీనిపై పుదుచ్చేరి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడంతో నెలాఖరులోగా వీరిని తరలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 
 
 పుదుచ్చేరిలో శాంతి భద్రతలు దిగజారడంపై లెఫ్టినెంట్ గవర్నర్ వీరేంద్ర కటారియా ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన స్వయంగా కాలాపేట కేంద్రకారాగారాన్ని తనిఖీ చేశారు. ఖైదీల వద్ద సెల్‌ఫోన్‌లు ఉండటాన్ని గుర్తించిన ఆయన భద్రత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ జైల్లోని కొందరు ఖైదీల ఆగడాలు మితిమీరుతున్నందున వీరిని తీహార్ జైలుకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వీరితో పాటు యానాం సబ్‌జైల్లో ఉన్న ఇద్దరు జీవిత ఖైదీలను కూడా తరలించడానికి నిర్ణయించింది.
 
మరిన్ని వార్తలు