తిరుమలకు దీపావళి శోభ

23 Oct, 2014 01:17 IST|Sakshi
తిరుమలకు దీపావళి శోభ
సాక్షి, తిరుమల:  తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం విద్యుద్దీపకాంతుల్లో మిరుమిట్లుగొలుపుతోంది. దీపావళి పర్వదినం పురస్కరించుకుని ఆలయానికి బుధవారం సాయంత్రం విద్యుత్ అలంకరణ చేపట్టారు. మహద్వారం నుంచి వెండివాకిలి గోపురం వరకు భక్తుల మనసులు దోచే రంగురంగుల విద్యుద్దీపాలు వెలిగించారు. ఆలయ ప్రాంతం శోభాయమానంగా మారింది. భక్తులు ఆనంద పరవశులయ్యారు. అలాగే, దీపావళి సందర్భంగా భక్తులు ఆలయం వద్ద, అఖిలాండం వద్ద నేతిదీపాలతో పూజలు చేశారు. 
 
 శ్రీవారి సేవలో జయేంద్ర సరస్వతి
 కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం మహద్వారం నుంచి ఆలయానికి చేరుకుని ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత గర్భాలయ మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. కంచి పీఠాధిపతికి ఆలయ పేష్కార్ సెల్వం శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల భక్తులు జయేంద్ర సరస్వతికి నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు.
 
మరిన్ని వార్తలు