పుష్పక విమానంపై సప్తగిరీశుని దివ్య దర్శనం

16 Oct, 2018 02:09 IST|Sakshi

తిరుమల: వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం పుష్పక విమానంలో శ్రీవారు ఊరేగారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి సంప్రదాయబద్ధంగా చామంతి, వృక్షం, గన్నేరు, మల్లెలు, కనకాంబరాలు వంటి పుష్పాలతో తయారుచేసిన పల్లకీ పై విహరిస్తూ భక్తకోటికి తన దివ్యమంగళ రూప దర్శనంతో సాక్షాత్కరించారు. ఈ పుష్ప పల్లకీకి మొత్తం 300 కేజీల పూలను ఉపయోగించారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అశేష భక్త జన గోవింద నామ స్మరణల మధ్య మంగళ వాయిద్యాలు, వేద పండితుల గోష్ఠి, జానపద కళా బృందాల సంగీత, గాన కచేరీలు కనువిందు చేయగా ఆద్యంతం ఉత్సవం వేడుకగా సాగింది.

ఇక ఉదయం శ్రీరామచంద్రుని రూపంలో మలయప్ప స్వామి తన భక్తశిఖామణి హనుమంతుని వాహనంగా మలుచుకుని ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ధనుర్బాణాలు చేతపట్టిన శ్రీరామచంద్రుడిని ఆంజనేయుడు తన భుజంపై ఉంచుకుని ఆలయ పురవీధుల్లో అశేష భక్త జనులకు కనువిందు చేశారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ముగ్ధమనోహరుడైన శ్రీనివాసుడు గజ వాహనంపై ఆశీనుడై రాజసంగా నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. భాగవతంలోని గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే తను శరణు కోరే వారిని ఎల్లవేళలా కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఈ వాహనంపై విహరించారు. ఆదివారం రాత్రి శ్రీవారి గరుడ వాహన సేవ వైభవంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు తెలిపారు. సోమవారం వారు మీడియా తో మాట్లాడుతూ.. టీటీడీ ఉద్యోగులు, విజిలెన్స్, పోలీసులు సమష్టిగా పనిచేసి వాహన సేవల్ని వైభవంగా నిర్వహించారని కొనియాడారు. 

గజవాహనంపై శ్రీనివాసుడు 

మరిన్ని వార్తలు