హంసపై వైకుంఠనాథుడు

15 Sep, 2018 03:53 IST|Sakshi
హంస వాహనంపై మలయప్పస్వామివారు

     వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం

     శాస్త్రోక్తంగా ధ్వజారోహణం

     పెద్దశేషుడిపై శ్రీనివాసుడి చిద్విలాసం

     ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

తిరుమల/కాణిపాకం : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల ఆరంభానికి నాందిగా ఆలయంలో గురువారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 4.45 గంటల మధ్య మకర లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) ఆవిష్కరించిన అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవి సమక్షంలో గోధూళి వేళలో కంకణ భట్టాచార్యులుగా సీనియర్‌ కాద్రిపతి నరసింహాచార్యులు క్రతువును, పతాకావిష్కరణ చేశారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే ముక్కోటి దేవతలకు బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రం. ఈ ఆహ్వానాన్ని అందుకుని సకల దేవతలు, అష్టదిక్పాలకులు తొమ్మిది రోజులపాటు సప్తగిరి క్షేత్రంలో ఉంటూ దేవదేవుని ఉత్సవాలను తిలకించి తన్మయత్వం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ధ్వజారోహణానికి ముందు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పరివార దేవతలతో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు.  

శ్రీవారికి సీఎం పట్టువస్త్రాల సమర్పణ
కాగా, బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత ఆయన సతీసమేతంగా ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు వేణుగోపాలదీక్షితులు సీఎంకు పట్టువస్త్రంతో తలపాగా చుట్టారు. తర్వాత వెండిపళ్లెంలో పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈఓ కేఎస్‌ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. 

పెద్దశేషుడిపై శ్రీనివాసుడు 
తిరుమల బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. వేంకటేశుడు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేష వస్త్రం. పానుపు శేషుడు. అందుకే ఉత్సవాల్లో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిరోజు శేషవాహనం మీద ఊరేగే సంప్రదాయంగా వస్తోంది. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో పూజలందుకున్న స్వామి వారిని  వాహన మండపంలో బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబర, సుగంధ పరిమళ పుష్పమాలలతో విశేషంగా అలంకరించారు. రాత్రి 8 గంటలకు ఛత్రచామర, మంగళవాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఉత్సవర్లు ఆలయ పురవీధుల్లో ఊరేగారు. వాహనసేవ ముందు భజన బృందాల సంకీర్తనలు భక్తులను అలరించాయి. పుష్పాలంకరణ, విద్యుత్‌ దీపకాంతుల్లో ఆలయం, పురవీధులు స్వర్ణకాంతులీనాయి. 

హంసపై వైకుంఠనాథుడు
బ్రహ్మోత్సవాల రెండో రోజు శుక్రవారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మలయప్ప స్వామి హంస వాహనాన్ని అధిరోహించి సర్వ విద్యాప్రదాయని అయిన సరస్వతీదేవి అలంకరణలో భక్తులను కటాక్షించారు. చేతిలో వీణ, విశేష దివ్యాభరణాలు, పట్టుపీతాంబరాలు ధరించి స్వామివారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగారు. టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గురువారం తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవానికి నాందిగా కంకణం ధరించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కార్యనిర్వహణాధికారి కంకణం ధరించాలి. 

కాణిపాకంలోనూ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభువు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఈఓ పి.పూర్ణచంద్రరావు, చైర్మన్‌ వి. సురేంద్రబాబు ఆధ్వర్యంలో విశాఖ నక్షత్రం, తులా లగ్నంలోని శుభగడియల్లో ఉ.9.30–10.15 గంటల మధ్య ఆలయ అర్చక, వేదపండితులు ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూషిక పటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. అనంతరం రాత్రి సిద్ధి బుద్ధి సమేత ఉత్సవమూర్తులను హంస వాహనంపై పురవీధుల్లో భక్తులను ఊరేగించారు.

మరిన్ని వార్తలు