తిరుమలకు బస్సులు యథాతథం

13 Sep, 2013 01:56 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలకు బస్సులు, ప్రయివేటు వాహనాలు బంద్ చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ జే ఏసీ నేతలు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. బంద్ నుంచి తిరుమలను మినహాయించాలని రెండు రోజులుగా  సమైక్యాంధ్ర జేఏసీ నేతలతో టీటీడీ అధికారులు చర్చలు జరుపుతున్న విషయం విదితమే. గురువారం ఉదయం ఆర్డీవో కార్యాలయంలో సమైక్య ఉద్యోగ జేఏసీ చైర్మన్, ఆర్డీవో రామచంద్రారెడ్డి నాయకత్వంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా పాల్గొన్నారు.

ఆర్డీవో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీమాంధ్రలో విభజనకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా బంద్ జరుగుతోందని, ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే తిరుమలకు వాహనాలను బంద్ చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు.  త్వరలో అన్ని వర్గాల జేఏసీలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి బంద్ తేదీలను నిర్ణయిస్తామని అన్నారు.  

ఆ తేదీలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన తర్వాత బంద్ చేస్తే యాత్రికులు కూడా స్వచ్ఛందంగా ప్రయాణాన్ని వాయిదా వేసుకునే అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగా ఈనెల 14, 15 తేదీల్లో జరగాల్సిన బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేశామని, తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

 పోలీసు అధికారుల బెదిరింపులు

 ఎన్నిసార్లు చర్చలు జరిపినా దిగిరాకపోవడంతో సమావేశానికి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరించారు. ఒక అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీ స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొని సమ్మె చేస్తే కేసులు పెడతామని, అరెస్టు చేస్తామని ఆవేశపూరితంగా అన్నారు. ఆర్టీసీ నాయకుడు ఒకరు మాట్లాడుతూ కేసులకు, అరెస్ట్‌లకు భయపడేది లేదని,  ప్రాణాలు పోయినా సమైక్య ప్రకటన వచ్చేవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

టాక్సీ డ్రైవర్ల సంఘం సిబ్బంది కూడా ఇదేవిధంగా స్పందించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు మునిసుబ్రమణ్యం, చల్లా చంద్రయ్య, ఆవుల ప్రభాకర్, ప్రకాష్, లతారెడ్డి, టీటీడీ అధికారుల సంఘం నాయకులు లక్ష్మీ నారాయణ, ప్రభాకర్‌రెడ్డి, భుట్టో సుబ్రమణ్యం, మోహన్‌రెడ్డి, టాక్సీ డ్రైవర్ల తరఫున ఇస్మాయిల్, ఉద్యోగ జేఏసీ నాయకులు శేషారెడ్డి, చంద్రయ్య, సురేష్‌బాబు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు