దర్శనంలో ఆన్‌లైన్ దందా!

12 Nov, 2014 01:57 IST|Sakshi
దర్శనంలో ఆన్‌లైన్ దందా!

‘శతకోటి ఉపాయాలకు.. అనంతకోటి మోసాలు?’ అన్న చందంగా శ్రీవారి ఆన్‌లైన్ దర్శనాల్లోనూ హైటెక్ దందా పురుడు పోసుకుంది. తిరుపతి కేంద్రంగా కొందరు దళారులు, ట్రావెల్ సంస్థలు దర్జాగా దర్శన దందా చేస్తున్నట్టు వెల్లడైంది. మంగళవారం వెలుగుచూసిన డ్రైవర్ షబ్బీర్ సంఘటన ఇందుకు ఉదాహరణ. రూ.300 టికెట్లకు ఒక్కోదానికి రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
 
సాక్షి, తిరుమల:  తిరుమలలో దర్శన దందాకు అడ్డుకట్ట వేసేందుకు టీటీడీ రూ.300 టికెట్ల ఆన్‌లైన్ దర్శనాలు ప్రారంభించింది. రోజుకు 11వేల టికెట్లు కేటాయిస్తున్నారు. ఇందులో ఒక రోజు తర్వాత దర్శనానికి వెయ్యి టికెట్లు, వారం తర్వాత దర్శనానికి ఐదువేలు, రెండు వారాల తర్వాత దర్శనానికి మరో ఐదువేల టికెట్లు అందుబాటులో ఉంటున్నాయి. ఆగస్టు 20వ తేది నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది.

ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉంది. పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ ఆన్‌లైన్ టికెట్లను కూడా దర్శన దళారులు సులభంగా అడ్డదారుల్లో కేటాయిస్తూ అక్రమార్జనకు తెరలేపారు. ముందుగానే దర్శన దళారులు, ట్రావెల్ సంస్థల ఏజెంట్లు భక్తుల పేర్లు, ఫొటోలు మెయిల్ ద్వారా తెప్పించుకుంటున్నారు. వాటితో టీటీడీ వెబ్‌సైట్‌ద్వారా రూ.300 ఆన్‌లైన్ టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. టికెట్లు వచ్చాక వాటిని మూడు నుంచి ఆరు రెట్లు అధికమొత్తానికి విక్రయిస్తున్నారు. ఇదే పద్ధతిలో నాలుగు టికెట్లు పొంది ఒక్కొక్కటి రూ.1000 చొప్పున విక్రయించి పట్టుబడిన డ్రైవర్ షబ్బీర్ ఘటన మంగళవారం వెలుగుచూసింది.

ఇంటర్నెట్ ఉంటే చాలు.. టికెట్లు రెడీ  
ప్రస్తుతం ఇంటర్నెట్ ఉంటే చాలు ఎక్కడి నుంచైనా రూ.50, రూ.300  సుదర్శనం టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకు కేవలం భక్తుల ఫొటోలు, పేర్లు ఉంటే చాలు? సులభంగా బుక్ చేసుకోవచ్చు. సంబంధిత టీటీడీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి స్వామి దర్శనానికి వెళ్లే వారి పేర్లు, ఫొటోలు అప్‌లోడ్ చేసి, ‘పేమెంట్ గేట్ వే పద్ధతి’లో నగదు చెల్లిస్తే..? సులభంగా టికెట్లు పొందడానికి వీలుంది. ఒకేసారి ఆరుగురికి టికెట్లు తీసుకునే వెసులుబాటు ఉంది. ఇదే పద్ధతిలో వేల టికెట్లయినా చట్టబద్ధంగానే తీసుకునే అవకాశం ఉంది.  ఇందుకోసం కొందరు దర్శన దళారులు కార్పొరేట్ కంపెనీలు, సంస్థలతో సంబంధాలు పెట్టుకుని వారికి ఇదే పద్ధతిలో టికెట్లు కేటాయిస్తున్నారు.

బయోమెట్రిక్‌తోనే ఆన్‌లైన్ దందాకు అడ్డుకట్ట
శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు భక్తులందరికీ దక్కే విధంగా రాష్ర్టంతోపాటు దేశ వ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం ధార్మిక సంస్థ కోట్లాది రూపాయలు ఖర్చుచేసింది. టీటీడీ ఈ-దర్శన్ కేంద్రాల్లో మాత్రమే రూ.50 సుదర్శనం, ఇతర ఆర్జిత సేవలు ఇచ్చేవారు. ఆ టికెట్లను పొందేందుకు భక్తులు వ్యక్తిగతంగా ఈ-దర్శన్ కేంద్రాలకు వెళ్లాలి. బయోమెట్రిక్ విధానంలో తమ వేలి ముద్ర వేసి, అక్కడి కంప్యూటర్ ద్వారా ఫొటో దిగి, నగదు చెల్లిస్తేనే టికెట్లు లభించేవి. దీంతో టికెట్ల కేటాయింపుల్లో లొసుగులకు అవకాశం చాలా తక్కువ.

ఒకరికి ఒక టికెట్టు మాత్రమే లభిస్తుంది. భక్తులను తిరుమలలో దర్శన సమయంలో పరిశీలించేందుకు కూడా చాలా సులువుగా ఉంటుంది. ప్రస్తుతం ఆ విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చే సే విధంగా కోటాను తగ్గించారు. వాటిని ఇంటర్నెట్ ఆన్‌లైన్ పద్ధతిలో కేటాయిస్తున్నారు. దీంతో అక్రమ దందాకు అవకాశం కల్పించారు. బయోమెట్రిక్ విధానం పటిష్టం చేయటం, ఒకసారి టికెట్టు పొందిన కంప్యూటర్ నుంచి నిర్ణీత రోజుల్లో మరొక టికెట్టు రాకుండా అడ్రస్‌లు లాక్ చేయటం, ఇతర అధునాతన సాంకేతిక పద్ధతులు అనుసరించటం ద్వారానే ఆన్‌లైన్ దందాకు అడ్డుకట్ట వేయవచ్చని ఐటీ నిపుణులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు