అయినా.. ‘సిరి’వారు

1 Jan, 2014 02:17 IST|Sakshi
అయినా.. ‘సిరి’వారు

ఉద్యమ ప్రభావంతో తగ్గిన భక్తుల సంఖ్య.. అయినా తగ్గని ఆదాయం
 
 సాక్షి, తిరుమల: 2013వ సంవత్సరంలో 1.96 కోట్ల మందికి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కలిగింది. టీటీడీ లెక్కల ప్రకారం 2012లో 2.43కోట్ల మంది దర్శించుకోగా ఈ ఏడాది సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభావం వల్ల భక్తుల సంఖ్య  50లక్షల వరకు తగ్గింది. అయితే హుండీ కానుకలు, తలనీలాలు సమర్పించే భక్తులు, వాటి అమ్మకాల వల్ల శ్రీవారి ఆదాయం పెరిగింది. ప్రతిరోజూ సరాసరి 65 వేల మందికి శ్రీవారి దర్శనం లభిస్తోంది. సెలవులు, పర్వదినాల్లో ఈ సంఖ్య లక్షకు పెరుగుతోంది.
 
 2010లో 2.14 కోట్ల మంది దర్శించుకోగా, 2011 జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు 2.43లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల భక్తుల రద్దీ తగ్గినా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం ఏయేడుకాయేడు పెరుగుతోంది. ఈ ఏడాది మొత్తానికి రూ.773కోట్లు లభించింది. ఇందులో అత్యధికంగా డిసెంబర్‌లోనే సుమారు రూ.78 కోట్ల మేర కానుకలు లభించాయి. హుండీలో మొత్తం ఏడాదిలో 1200 కేజీల బంగారు ఆభరణాలు, కానుకలు లభించాయి. హుండీ కానుకలు 2010- 2011 ఆర్థిక సంవత్సరంలో రూ.575 కోట్లు, 2011-2012లో రూ.731 కోట్లు, 2012- 2013లో రూ.859 కోట్లు లభించాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.773 కోట్లు లభించింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూ.900 కోట్లు పైబడి కానుకలు లభించే అవకాశం కనిపిస్తోంది. కాగా, 2012 జనవరి1 వతేదీన రూ.4.23 కోట్లు, అదే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ శ్రీరామనవమి పర్వదినాన ఒక రోజు హుండీ లెక్కింపుల్లో 5.73 కోట్ల రూపాయల కానుకలు లభించడం ఇప్పటికీ రికార్డుగానే ఉంది. భక్తులు సమర్పించే కురులు సిరులు కురిపిస్తున్నాయి.  నాలుగు విడతల్లో నిర్వహించిన ఈ-వేలంలో రూ.260కోట్లు లభించింది.  
 
 రూ.2,500 కోట్లు దాటనున్న 2014-15 బడ్జెట్..!
 
 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు రూ.2,248 కోట్ల అంచనాతో టీటీడీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2014-2015 ఆర్థిక సంవత్సరంలో ఈ బడ్జెట్ సుమారు రూ.2500 కోట్లు దాటవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. భక్తులు, హుండీ కానుకలు, ఆదాయ వనరులు కూడా భారీగా పెరిగాయి. ఆదాయంతోపాటు ఖర్చుల అంచనాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
 
 కానరాని ‘కొత్త’ సందడి
 
 టీటీడీ వేసిన భారీ అంచనాలు తలకిందులయ్యాయి. కొత్త సంవత్సరం సందడి తిరుమలలో కన్పించలేదు. భక్తుల రద్దీ వల్ల ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో వీవీఐపీ భక్తులతోపాటు సాధారణ భక్తులు కూడా కొత్త సంవత్సరం దర్శనానికి దూరంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది.  కాగా, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహద్వార గోపురం, చుట్టూ ప్రాకారాలకు మిరుమిట్లుగొలిపే విద్యుత్ బల్బులతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు.  సువాసనలు వెదజల్లే సంప్రదాయ పుష్పాలు, స్వదేశీ, విదేశాలకు చెందిన కట్‌పుష్పాలతో మహద్వారం నుంచి గర్భాలయం వరకు అలంకరించారు. బలిపీఠం, ధ్వజస్తంభానికి విదేశాల కట్‌పుష్పాలతో చేసిన అలంకరణలు చూసిన భక్తులు ఆనందపరవశులవుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు