తిరుమలలో ఆక్టోపస్ కమాండోల మాక్ డ్రిల్

9 Aug, 2014 08:45 IST|Sakshi

సాక్షి, తిరుమల: యాక్షన్ టీంగా పరిగణించే ఆక్టోపస్ కమాండోలు గురువారం తిరుమలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. తీవ్రవాది ప్రయాణించే వాహనాన్ని మరో వాహనంతో ఛేజ్ చేయడం.. చాకచక్యంగా అతన్ని అదుపులోకి తీసుకునే విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు.

గురువారం ఉద యం తిరుమలలో బాలాజీనగర్ రింగ్‌రోడ్డులో నిర్వహించిన మాక్ డ్రిల్ సాగిందిలా.. మధ్యాహ్నం 12 గంటలకు హఠాత్తుగా ఓ కారు రింగ్‌రోడ్డుపైకి దూసుకుపోయింది. వెనుకే మరో కారు మెరుపు వేగంతో దూసుకొచ్చింది. వాహనం నుంచే కమాం డో సిబ్బంది తుపాకులు చేతపట్టి ముందు వెళ్లే వాహనంపై గురిపెట్టారు. చాకచక్యంగా ముందుకారును అడ్డగించారు. సెకన్ల వ్యవధిలోనే కమాం డోలు తుపాకులు, పిస్తోళ్లు చేతపట్టుకుని వాహనం దిగారు.

అంతకుముందే ఆ రహదారి, ముళ్లపొదలు, చెట్ల మధ్యలో బృందాలుగా కాపుకాచిన ఆక్టోపస్ కమాండోలు హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చి ఆయుధాలతో అడ్డగించారు. వాహనం వద్దకు వెళ్లి తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి ఆలయ భద్రత కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన ఆక్టోపస్ యూనిట్ కమాండో దళాలకు ప్రతినెలా ఏదో ఒక అంశంపై మాక్ డ్రిల్ చేస్తూ ఉగ్రవాదులు, నేరస్తులు, నిందితులను పట్టుకునే విషయంలో ఇలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
 

మరిన్ని వార్తలు