వెంకన్నా క్షమించు

17 Aug, 2014 04:37 IST|Sakshi
వెంకన్నా క్షమించు
  • నీ పూజకు కొబ్బరి కాయల్లేవు
  •  కర్పూరంతో సర్దుకో     
  •  భక్తుల ఆవేదన
  • సాక్షి, తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి పూజకు కొబ్బరికాయల కొరత ఎదురైంది. శనివారం అఖిలాండం వద్ద భక్తులు కర్పూరం, అగరబత్తీలు మాత్రమే వెలిగించి అసంపూర్తిగా మొ క్కులు చెల్లించారు. ఆలయ అధికారులు మాత్రం పట్టీపట్టనట్టుగా ఉన్నారు.
     
    సాధారణంగా భక్తులు నడిచి తిరుమల కొండెక్కడం, కల్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించడం, పుష్కరిణి స్నానం, శ్రీవారి దర్శనం, అఖిలాండం వద్ద కొబ్బరికాయ సమర్పించడం ఇక్కడి క్షేత్ర సంప్రదాయం. తిరుమలలో రోజులో స్వామిని    దర్శించుకునే 60 వేల మందిలో 20 వేల మంది దాకా ఆలయ అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి  పరిపూర్ణంగా మొక్కులు చేసుకుంటారు. కొబ్బరికాయలు విక్రయించేందుకు అఖిలాండం వద్ద టీటీడీ ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది.

    రూ.15 చొప్పున ఒక సెట్‌లో కొబ్బరికాయ, కర్పూరం, అగర్‌బత్తీ అందజేస్తుంది. మూడు రోజులుగా భక్తులు పోటెత్తారు. ముందుజాగ్రత్త లేకపోవడంతో మూడు రోజులుగా అఖిలాండం వద్ద కొబ్బరికాయలకు తీవ్ర కొరత ఏర్పడింది. అడపాదడపా కొబ్బరికాయలు వచ్చినా గంటలోపే అమ్ముడవుతున్నాయి. శనివారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొబ్బరికాయల్లేవు. కౌంటర్లు మూసివేయటంతో మొక్కు చెల్లించేందుకు వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

    ఇదే ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులు విక్రయించే కర్పూరం వెలిగించి ‘క్షమించు స్వామి.. కొబ్బరికాయ లేదు. కర్పూరం మాత్రమే వెలిగించా.. సర్దుకో’ అంటూ తీవ్ర ఆవేదనతో తిరుగుముఖం పట్టారు. కొబ్బరికాయల కొరతపై ఆలయ అధికారులు  ఏమాత్రం పట్టించుకోలేదు. తరచూ భక్తులకు ఎదురయ్యే కొబ్బరికాయల స్టాకు సమస్యను పరిష్కరించటంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి.
     

మరిన్ని వార్తలు