కల్పవృక్షంపై కమలాకాంతుడు

4 Oct, 2019 10:09 IST|Sakshi

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు గురువారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామివారు కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనంపై తిరువీధుల్లో విహరించారు. చర్నాకోలు చేతబట్టి రాజమన్నార్‌ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. గజరాజులు, అశ్వాలు ఠీవీగా ముందు కదులుతుండగా, మంగళవాయిద్యాలు, వేదఘోష, అశేష భక్తుల గోవిందనామస్మరణ నడుమ వాహనసేవ కనులపండువగా సాగింది. భక్తుల కోలాటాలు, కళా ప్రదర్శనలు కట్టిపడేశాయి. రాత్రి ఉభయ దేవేరులతో కలసి సర్వ భూపాల వాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తులను కటాక్షించారు. 
–తిరుమల  

సాక్షి, తిరుపతి : తుమ్మలగుంటలో బ్రహ్మోత్సవం కనుల పండువగా సాగుతోంది.   బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం కల్పవృక్షం, రాత్రి సర్వభూపాల వాహనాలపై స్వామివారు దర్శనమిచ్చారు.  ఉదయం కల్పవృక్ష వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో కనిపించారు. రాత్రి సర్వభూపాల వాహన సేవలో అంతకంటే ఎక్కువ స్థాయిలో భక్తులు తరలివచ్చారు.

వాహనసేవలో వీఐపీలు
తుమ్మలగుంట కల్యాణ వెంకన్నను గురువారం పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, బ్రహ్మర్షి ఆశ్రమ పీఠాధిపతి గురువానంద గురూజీ, ఎంపీ రెడ్డెప్ప దర్శించుకున్నారు. వెంకన్న ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. చెవిరెడ్డితో కలిసి వారు కల్యాణ వెంకన్నకు ప్రత్యేక పూజలు చేశారు. 

కల్పవృక్ష వాహన సేవలో పెద్దిరెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ఉదయం కల్ప వృక్ష వాహన సేవలో పాల్గొన్నారు. సర్వ భూపాల వాహన సేవలో నారాయణస్వామి, గురువానంద గురూజీ గురువారం రాత్రి సర్వభూపాల వాహన సేవలో సీ.రామాపురం బ్రహ్మర్షి ఆశ్రమ పీఠాధిపతి గురువానంద గురూజీ, డిప్యూటీ  సీఎం నారాయణ స్వామి, ఎంపీ రెడ్డెప్ప పాల్గొన్నారు. 

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
వాహన సేవల ముందు సంగీత, సాంస్కృతిక  కళాబృందాల ప్రదర్శనలు భక్తులను కట్టిపడేస్తున్నాయి. భజన కళాకారుల నృత్యాలు, డప్పువాయిద్యాలు, తాళం వేస్తూ ఒకరికొకరు పోటీ పడుతూ భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.

నేడు గరుడసేవ
బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు గరుడవాహనంపై స్వామి దర్శనమిస్తారు. శుక్రవారం రాత్రి 7గంటలకు ఈ వాహన సేవ ప్రారంభమవుతుందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరుపతి వెస్ట్‌ డీఎస్పీ నరసప్ప ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు