సుదర్శనంలో ఇక్కట్లు

11 Sep, 2015 01:18 IST|Sakshi

 శ్రీకాకుళం సిటీ: తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకొనేందుకు ముందుగానే భక్తులు ప్రణాళికలు రూపొందించుకుంటారు. స్వామి వారి ఆర్జిత సేవలతో పాటు, గదులు, సమగ్ర సమాచారాన్ని తెలుసుకొని తిరుపతి పయనమవుతారు. స్వామి వారి దర్శనం కోసం ముందుగా టోకెన్లు వేసుకునేందుకు, గదులు బుక్ చేసుకునేందుకు భక్తుల సౌకర్యార్థం సుదర్శన్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రంలో టీటీడీ కల్యాణ మండపంలో ఈ-సుదర్శన్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. అయితే గత నెల రోజుల్లో పట్టుమని 10 రోజులు కూడా ఈ కౌంటర్ పనిచేసిన దాఖలాలు లేవని సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్ఛాపురం నుంచి పైడి భీమవరం వరకు ఈ కౌంటర్‌లోనే అన్ని రకాల ఆర్జిత సేవలను పొందేవారు.
 
 పోస్టాఫీస్‌ల్లో కూడా రూ. 300 స్వామివారి టిక్కట్లు ఇస్తున్నప్పటికీ ఎక్కువగా ఈ-సుదర్శన్ కౌంటర్‌పైనే భక్తులు ఆధారపడుతున్నారు. ఈ కౌంటర్‌లో కంప్యూటర్‌కు గత నెల రోజులుగా గ్రహణం పట్టింది. ఎప్పుడు పనిచేస్తుందో... ఎప్పుడు పనిచేయదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. దీనిలో ఏ పార్టు పనిచేయకపోయినా ముందుగా తిరుపతికి సమాచారాన్ని అందించాలి.
 
 ఇక్కడి పరిస్థితిపై పూర్తిగా ఇండెంట్ పెడితే గాని ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి ఉండదు. ఇదిలావుండగా ఈ నెలలో తిరుపతిలో జరగనున్న స్వామివారి వార్షిక బ్రహోత్సవాల నేపథ్యంలో ఇక్కడి ఈ-సుదర్శన్ కౌంటర్‌కు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. అయితే కంప్యూటర్ మోరాయిస్తుండడంతో ఎక్కడెక్కడి నుంచో స్వామి వారి ఆర్జిత సేవల కోసం ఇక్కడికి వ స్తున్న భక్తులకు చేదు అనుభవం తప్పడం లేదు. టీటీడీ సేవలపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి ఇక్కడ నిరీక్షించినా ఫలితం ఉండడం లేదని భక్తులు చెబుతున్నారు. దీంతో పాటు ఈ-సుదర్శన్ కౌంటర్ పరిస్థితిపై తెలుసుకుందామంటే అక్కడ ఉన్న ఫోన్ కూడా పనిచేయడంలేదని అంటున్నారు. అధికారులు తక్షణం స్పందించాలని భక్తులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు