సైన్స్‌ కాంగ్రెస్‌కు తిరుపతి ముస్తాబు

2 Jan, 2017 01:24 IST|Sakshi

- రేపు ఉదయం ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం
- 4న ప్రముఖులతో ముఖాముఖి

సాక్షి, అమరావతి:  ఐదు రోజుల పాటు జరిగే 104వ భారత సైన్స్‌ కాంగ్రెస్‌ (ఐఎస్‌సీ) సమ్మేళ నానికి పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి ముస్తాబైంది. మంగళవారం నుంచి 7వ తేదీ వరకు జరిగే ఈ సమ్మేళనాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంఛ నంగా ప్రారంభించనున్నారు. ఇందుకు శ్రీవేంక టేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణ వేదిక కానుం ది. సైన్స్‌ కాంగ్రెస్‌ ఉద్దేశాన్ని వివరించే పోస్టర్లు వాడవాడలా వెలిశాయి. యూనివర్సిటీ దారు లన్నీ ఆకర్షణీయ బ్యానర్లు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికే ఫ్లెక్సీలతో నిండిపో యాయి. శాస్త్రీయ పరిజ్ఞానాన్ని జనానికి చేరువ చేసే దిశగా పలు ప్రదర్శనలు, సదస్సులు, సమావేశాలకు వర్సిటీలోని వివిధ ప్రాంగణాలు సిద్ధమయ్యాయి.

ప్రపంచ లబ్ధ ప్రతిష్టులైన తొమ్మిది మంది నోబెల్‌ బహుమతి గ్రహీతలు, శాస్త్ర, సాంకేతిక రంగాలలో నిష్ణాతులైన 200 మంది శాస్త్రవేత్తలు, జాతీయ ప్రయోగశాలల శాస్త్రవే త్తలు, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎస్‌ఇఆర్‌ఎస్‌ తదితర సంస్థలకు చెందిన 18 వేల మంది ప్రతినిధులు సైన్స్‌ కాంగ్రెస్‌కు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా బాలల సైన్స్‌ కాంగ్రెస్, శాస్త్రీయ కార్యక్రమం, మహిళా సైన్స్‌ కాంగ్రెస్, సైన్స్‌ పరివాహకుల సదస్సు, సైన్స్‌ ఎగ్జి బిషన్, ప్లీనరీ సమావేశాలు కూడా నిర్వహించ నున్నారు.

ఈసారి ఎక్స్‌పో విశిష్టత ఇదీ...
సైన్స్‌ కాంగ్రెస్‌తో పాటు నిర్వహించనున్న ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా ఎక్స్‌పో (పీఒఐ)లో కొత్త ఆలో చనలు, కొంగొత్త ఆవిష్కరణలు, సంబంధిత ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. దేశంలోని ప్రముఖ ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు ఇందులో పాల్గొంటాయి. సామాన్యులు సైతం ఈ ప్రదర్శనను సందర్శించవచ్చు. వీటితో పాటు ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకుల జీవనయానంలోని మజిలీలను తెలియజేసేలా మరో ప్రదర్శనను హాల్‌ ఆఫ్‌ ప్రైడ్‌ పేరిట నిర్వహిస్తారు.

తిరుపతికి రానున్న విజ్ఞాన జ్యోతి...
శాస్త్ర విజ్ఞానాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేలా ఢిల్లీలో బయలుదేరిన విజ్ఞాన జ్యోతి సైన్స్‌ కాంగ్రెస్‌ మహాసభ ప్రారంభం నాటికి తిరుపతి చేరుకుంటుంది. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఆశయం మేరకు విజన్‌ 2010 పేరిట ఈ విజ్ఞాన జ్యోతి ప్రారంభమైంది.

4న జెనిసిస్‌...: సైన్స్‌ కాంగ్రెస్‌లో రెండోరోజు (4వ తేదీ) వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులతో జెనిసిస్‌ పేరిటి ముఖాముఖి నిర్వహిస్తారు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించడం కోసం పారిశ్రామిక రంగం చేపట్టాల్సిన, చేపట్టిన పథకాలు, కార్యక్రమాలపై సభికుల ప్రశ్నలకు ప్రముఖులు జవాబులిస్తారు.

మరిన్ని వార్తలు