తిరుపతి కేంద్రంగా ‘ఆక్టోపస్’

16 Jun, 2014 03:55 IST|Sakshi
తిరుపతి కేంద్రంగా ‘ఆక్టోపస్’
  • రేణిగుంట పరిసర ప్రాంతాల్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం
  •  తీవ్రవాదులను అణచివేయడానికి 400 మంది కమెండోలతో ఆక్టోపస్ విభాగం
  •  తిరుమల వేంకటేశ్వరుని ఆలయానికి పెరగనున్న మరింత భద్రత
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి:  రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆక్టోపస్(ఆర్గనైజేషన్ ఆఫ్ కౌంటర్ టైస్ట్ ఆపరేషన్స్) రాష్ట్ర ప్రధాన కార్యాలయం తిరుపతిలో ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతికి సమీపంలోని రేణిగుంట పరిసర ప్రాంతాల్లో ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేయనున్నారు. తిరుమలలో వేంకటేశ్వరస్వామి దేవాలయానికి ఇప్పటికే ఆక్టోపస్ భద్రత కల్పిస్తున్న విషయం విదితమే. ఆక్టోపస్ ప్రధాన కార్యాలయం తిరుపతిలో ఏర్పాటుకానున్న నేపథ్యంలో వేంకటేశ్వరస్వామి దేవాలయానికి భద్రత మరింత కట్టుదిట్టం కానుంది. వివరాల్లోకి వెళితే..
     
    రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలను అణచివేయడం, నిరోధించడం, తిప్పికొట్టడం కోసం హైదరాబాద్ కేంద్రంగా అక్టోబర్ 1, 2007న ఆక్టోపస్ ఏర్పాటుచేశారు. పోలీసుశాఖలో పనిచేసే 500 మంది మెరికల్లాంటి అధికారులను ఆక్టోపస్‌కు ఎంపిక చేసి, వారికి కమెండో శిక్షణ ఇప్పించారు. తిరుమలలో వేంకటేశ్వరస్వామి ఆలయానికి తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని కేంద్ర నిఘా వర్గాలు గతంలో హెచ్చరికలు చేశాయి.

    ఈ నేపథ్యంలో ఏఆర్ పోలీసు విభాగంతో ఆలయానికి భద్రత కల్పించారు. ఆక్టోపస్ ఏర్పాటైన తర్వాత 90 మంది సభ్యులున్న ఒక దళం ప్రస్తుతం తిరుమ ల తిరుపతి దేవస్థానం భద్రతను పర్యవేక్షిస్తోంది. చిత్తూరు జిల్లాలో తీవ్రవాద కదలికలు ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు అనేకమార్లు హెచ్చరించాయి. పుత్తూరులోని ఓ ఇంట్లో తిష్టవేసిన ఇస్లామిక్ లిబరేషన్ ఫ్రంట్(ఐఎల్‌ఎఫ్) తీవ్రవాద విభాగానికి చెందిన ఫకృద్దీన్, ఇస్మాయిల్ పన్నా, బిలాల్ మాలిక్‌ను అక్టోబర్ 6, 2013న ఆక్టోపస్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

    ఇందులో ఇస్మాయిల్ పన్నా బెంగళూరులో బీజేపీ కార్యాలయంపై చేసిన దాడిలో ప్రధాన భూమిక పోషిస్తే, తమిళనాడు సేలంలో బీజేపీ నేత రమేష్ హత్య కేసులో బిలాల్ మాలిక్ ప్రధాన నిందితుడు. ఫకృద్దీన్ ఐఎల్‌ఎఫ్ తీవ్రవాద సంస్థ అధినేత. ఈ ముగ్గురూ కలిసి తిరుమలలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో విధ్వంసం సృష్టించడానికి ప్రణాళిక రచించినట్లు కేంద్ర నిఘా వర్గం గుర్తించింది. కేంద్ర నిఘా వర్గాల సూచనల మేరకు ఆక్టోపస్ రంగంలోకి దిగి పుత్తూరులో తీవ్రవాదులు మకాం వేసిన ఇంటిపై దాడి చేసి, వారి ఆట కట్టించింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల హిట్‌లిస్ట్‌లో తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం ఉన్న నేపథ్యంలో.. ఆలయ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
     
    రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఆక్టోపస్ ప్రధాన కార్యాలయం తెలంగాణకు కేటాయించారు. మన రాష్ట్రంలో ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేయడానికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిని పరిశీలించారు. చివరకు తిరుపతిలోనే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తిరుమలలో నాలుగు ఎకరాల భూమిని కేటాయిస్తే.. అక్కడే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తామన్న ఆ విభాగం ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది.

    తిరుపతి పరిసర ప్రాంతాల్లోని రేణిగుంట, చంద్రగిరిల్లో ఆక్టోపస్‌కు భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రేణిగుంటకు సమీపంలో విమానాశ్రయం ఉంది. ఎక్కడైనా తీవ్రవాదుల దాడులు జరిగితే.. అక్కడికి తక్షణమే చేరుకోవాలంటే విమానాశ్రయానికి సమీపంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని ఆక్టోపస్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

    ఈ నేపథ్యంలో రేణిగుంట పరిసర ప్రాంతాల్లో భూమిని ఆక్టోపస్‌కు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. రేణిగుంట పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే ఆక్టోపస్ ప్రధాన కార్యాలయంలో కనిష్ఠంగా 400 మంది కమెండోలతో కూడిన నాలుగు దళాలు అందుబాటులో ఉంటాయి. ఇందులో తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయ భద్రతకు ఒక దళాన్ని కేటాయిస్తారు. తక్కిన మూడు దళాలను తీవ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి వినియోగించనున్నారు.
     

మరిన్ని వార్తలు