స్వచ్ఛత సాగేదిలా..

25 Dec, 2019 10:17 IST|Sakshi
భారీ యంత్రం ద్వారా భవన నిర్మాణ వ్యర్థాల సెగ్రిగేషన్‌

ఘన వ్యర్థాల నిర్వహణలో మరింత ముందడుగు

రోజుకు 197 మెట్రిక్‌ టన్నుల చెత్త సెగ్రిగేషన్, రీసైక్లింగ్‌

మీడియాతో కలిసి తిరుపతి కమిషనర్‌ స్వచ్ఛ యాత్ర

తిరుపతి తుడా: స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాతీయ పోటీల్లో ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి ఖ్యాతిని మరింత ఇనుమడింపచేసేందుకు తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోంది. నగరంలో ఉత్పత్తయ్యే 197 మెట్రిక్‌ టన్నుల చెత్తను జీరో స్టోరేజ్‌గా అమలుచేస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛత కోసం చేస్తున్న ప్రయోగాలు, మార్పులపై కమిషనర్‌ గిరీషా అధికారులతో కలిసి మంగళవారం మీడియా ప్రతినిధులతో కలిసి స్వచ్ఛ యాత్రను చేపట్టారు. ఆయనతో పాటు సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఉదయ్‌కుమార్, డి ప్యూటీ కమిషనర్‌ చంద్రమౌళేశ్వరరెడ్డి, మున్సి పల్‌ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, డీఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి స్వచ్ఛత, సాలిడ్‌ వేస్టు నిర్వహణపై అందించిన వివరాలు ఇవి.. 

చెత్త రోడ్డుపైకి రాకముందే ఇంటి వద్దే సేకరించేందుకు పూర్తిస్థాయిలో కార్మికులను నియమించుకుని 100 శాతం సేకరిస్తున్నారు. 60 శాతం ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను వేరుచేసి సేకరిస్తున్నారు. ఇందుకోసం 905 మంది కార్మికులు, 371 పుష్‌కాట్‌లు, 25 ఆటోలు, 20 కాంప్యాక్టర్లు, 15 ట్రాక్టర్లు, 2 జేసీబీలు, 6 చిన్న జేసీబీలు ఉపయోగిస్తున్నారు.  
నగరంలో ఉత్పత్తయ్యే 197 మెట్రిక్‌ టన్నుల చెత్తలో 120 టన్నుల తడి చెత్త ఉంది. 52 టన్నుల పొడి చెత్త, 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాల తరలింపునకు 3 ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కోమల్‌రెడ్డి కూడలి వద్ద ఒక స్టేషన్‌ను రూ.8 కోట్ల ఖర్చుతో అందుబాటులోకి తీసుకొచ్చారు.  
నగరంలో రోజుకు ఉత్పత్తయ్యే 120 టన్నుల తడి చెత్తలో 50 టన్నుల చెత్తను బయోగ్యాస్‌కు ఉపయోగిస్తున్నారు. 1,500 వందల కేజీల గ్యాస్‌ ఉత్పత్తులను ఇక్కడ నిర్వహిస్తూ దేశంలోనే అతిపెద్ద బయోగ్యాస్‌ ప్లాంట్‌గా రికార్డుల్లో నిలిచింది. ఇక్కడ ఉత్పత్తయ్యే ఈ గ్యాస్‌ను నగరంలోని 10 హోటళ్లకు సరఫరా చేసి మిగిలిన దాన్ని చెన్నై, బెంగళూరు హోటళ్లకు తరలిస్తున్నారు.
నిత్యం ఉత్పత్తయ్యే 25 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి పునర్వినియోగంలోకి తీసుకొచ్చేందుకు సీ అండ్‌ డీ (కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెమాలిష్‌) ప్రాజెక్టును నిర్వహిస్తోంది.  
తూకివాకంలోని గ్రీన్‌ సిటీలో విన్‌డ్రో కంపోస్టు ద్వారా రోజుకు 60 టన్నుల చెత్తను విన్‌డ్రో, బాక్స్‌ కంపోస్టు ద్వారా ఎరువు తయారు చేస్తున్నారు. ఈ ఎరువులను పార్కులు, మొక్కల పెంపకానికి ఉపయోగస్తున్నారు. 

బయో మైనింగ్‌  
35 ఏళ్ల నాటి నుంచి రామాపురం సమపంలోని డంపింగ్‌ యార్డులో సుమారు 5 లక్షల టన్నుల చెత్త నిల్వ ఉంది. ఈ చెత్తను 100 శాతం సెగ్రిగేషన్, రీసైక్లింగ్‌ చేపట్టడం ద్వారా జీరో స్థాయి నిల్వ లక్ష్యంగా బయో మైనింగ్‌ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. రోజుకు 600 టన్నుల చెత్తను సెగ్రిగేషన్‌ (వేరుచేయడం), రీసైక్లింగ్‌(తిరిగి వినియోగంలోకి) చేస్తున్నారు. తద్వారా ఆరు నెలల్లో డంపింగ్‌ యార్డుల్లోని చెత్తను కనుమరుగు చేసే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. ఇక్కడ వెలికి తీసుకున్న ఇనుము, ప్లాస్టిక్, రాయి, టైర్లను రీసైక్లింగ్‌ ద్వారా విక్రయిస్తున్నారు. ఏళ్ల నాటి చెత్త కావడంతో ఇప్పటి వరకు 10 వేల టన్నుల ఎరువును విక్రయానికి సిద్ధంగా ఉంచారు. మిగులు చెత్తను సిమెంట్‌ ఫ్యాక్టరీలకు సరఫరా చేస్తున్నారు.

ప్రజల భాగస్వామ్యంతో..
ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ తిరుపతి కిరీటాన్ని దక్కించుకుంటాం. నగరంలో ఉత్పత్తయ్యే చెత్తను 100 శాతం సెగ్రిగేషన్, రీసైక్లింగ్‌ చేస్తున్నాం. తిరుపతి కార్పొరేషన్‌ అమలు చేస్తున్న కొత్త ప్రయోగాలతో వచ్చే ఏడాది కల్లా దేశంలో మరేనగరం పోటీ పడనంతగా ఉండబోతోంది. ఇంటింటా చెత్త సేకరణ ఇకపై వాహనాల ద్వారానే చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. డిసెంబర్‌ చివరి నుంచి జనవరి నెలాఖరు వరకు స్వచ్ఛ పోటీలకు అత్యంత కఠినమైన రోజులు, ఈ నేపథ్యంలో ప్రజలు మరింతగా సహకరించాల్సి ఉంది. – పీఎస్‌ గిరీష, కమిషనర్,    తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌

మరిన్ని వార్తలు