తిరుపతి కమిషనరేట్‌కు మార్గం సుగమం

9 May, 2015 02:55 IST|Sakshi
తిరుపతి కమిషనరేట్‌కు మార్గం సుగమం

-  జిల్లాలో పోలీసుల పంపకాలపై కసరత్తు
- చిత్తూరుకు 60, తిరుపతికి 40 శాతం
- ఇద్దరు ఎస్పీల సమక్షంలో ఐజీ, డీఐజీ చర్చ
చిత్తూరు (అర్బన్):
తిరుపతిని ప్రత్యేక పోలీసు కమిషనరేట్ చేయడం, స్వయం ప్రతిపత్తి కల్పించడంపై కసర్తు మొదలైంది. తొలి దశగా రెండు జిల్లాల్లోని 139 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. చిత్తూరు, తిరుపతి పోలీసు జిల్లాల్లో పద్ధతి ప్రకారం పోలీసు సిబ్బంది పంపకాలు జరిపేందుకు అధికారులు చేపట్టిన చర్యలు కొలిక్కి వస్తున్నాయి. ఇందులో భాగంగా రాయలసీమ ఐజీ వేణుగోపాలక్రిష్ణ, అనంతపురం ఐజీ బాలక్రిష్ణ చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్‌జెట్టి సమక్షంలో రెండు జిల్లాలకు చెందిన ఏఎస్పీలు, ఏవోల ఆధ్వర్యంలో సిబ్బందిని ఎక్కడ ఎంతమందిని ఉంచాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు.

చిత్తూరు పోలీసు జిల్లా పరిధి పెద్దది కావడంతో రెండు జిల్లాల్లో ఉన్న సిబ్బందిలో ఇక్కడకు 60 శాతం, తిరుపతికి 40 శాతం కేటాయించనున్నారు. వీరిలో కార్యాలయ గుమాస్తాలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోమ్‌గార్డులు ఉన్నారు. తొలిదశలో చిత్తూరు నుంచి 30 మంది ఏఎస్‌ఐలు, 16 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, ఇద్దరు ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు తిరుపతికి బదిలీ అయ్యారు. తిరుపతి నుంచి 10 మంది ఎస్‌ఐలు, 71 మంది హెడ్‌కానిస్టేబుళ్లు చిత్తూరుకు బదిలీ అయ్యారు. పంపకాలు ఓ కొలిక్కి రావడంతో ఇబ్బందులున్న సిబ్బంది ఆయా పోలీసు సంక్షేమ సంఘ నాయకుల ద్వారా ఉన్నతాధికారులకు వినతులు అందజేశారు.

ఇప్పటికే తిరుపతిని ప్రత్యేక పోలీసు కమిషనరేట్ చేయాలనే ప్రతిపాదన ఉండటంతో సిబ్బంది పంపకం పక్కాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం జీవో జారీ చేసి తిరుపతి అర్బన్ పోలీసు జిల్లాకు మిగిలిన జిల్లాలాగే స్వయం ప్రతిపత్తిని కల్పించనుంది. ఈ సమావేశంలో చిత్తూరు ఏఎస్పీలు అన్నపూర్ణారెడ్డి, ఓఎస్డీ రత్న, తిరుపతి ఏఎస్పీ త్రిమూర్తులు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామ్‌కుమార్, చిత్తూరు, తిరుపతి పోలీసు సంక్షేమ సంఘ అధ్యక్షులు చలపతి, గోపాల్ తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు