తిరుపతి ‘దేశం’లో ఐక్యత ఒట్టిమాటే!

27 Apr, 2014 03:54 IST|Sakshi
తిరుపతి ‘దేశం’లో ఐక్యత ఒట్టిమాటే!
  • చదలవాడ, వెంకటరమణ మధ్య కొనసాగుతున్న విభేదాలు
  •  సమన్వయం లేదని పొలిట్‌బ్యూరో సభ్యులు కంభంపాటికి ఫిర్యాదు చేసిన నీలం
  •  వెంకటరమణ కోటరీకే ప్రాధాన్యం ఇస్తున్నారని టీడీపీ కార్యకర్తల ఆందోళన
  •  సాక్షి, తిరుపతి: తిరుపతి తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరి క్షణంలో అనూహ్యంగా టీడీపీ టికెట్టు దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ కాంగ్రెస్ నుంచి వచ్చిన కోటరీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో నియోజకవర్గ ఇన్‌చార్జ్ చదలవాడ కృష్ణమూర్తితోపాటు టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి.

    శనివారం తిరుపతికి వచ్చిన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కంభంపాటి రామ్మోహన్‌రావుకు వెంకటరమణపై టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసే స్థాయికి విభేదాలు చేరుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. కంభంపాటి రాకకు సంబంధించిన సమాచారం వెంకటరమణకు తెలిసినప్పటికీ చదలవాడకుగానీ ఇతర ముఖ్యనాయకులకుగానీ కబురు చేయలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు అసలైన టీడీపీ కార్యకర్తలకు ఎలా గౌరవం దక్కుతుందని వారు వాపోతున్నారు.

    ఒకే సామాజికవర్గానికి చెందిన చదలవాడ, వెంకటరమణల మధ్య విభేదాలు లేవని తెలియజేసేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు కంభంపాటి రాకతో అంతా ఒట్టిదేనని తేలింది. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బాధ్యతలు డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన పార్టీ కమిటీలకు అప్పగించే విషయంలో వివాదం తలెత్తింది. అదికాస్త బహిర్గతం కావడంతో చదలవాడ, వెంకటరమణ వర్గాల మధ్య తాత్కాలికంగా సమన్వయం కుదిర్చారు.

    అన్ని డివిజన్ కమిటీలు కాకుండా అవసరమైన చోట మాత్రమే మార్చేందుకు వెంకటరమణకు అవకాశం ఇచ్చారు. మధ్యేమార్గంగా జరిగిన ఒప్పందం తాత్కాలికమేనని శనివారం కంభంపాటి రాకతో స్పష్టమైంది. పార్టీ నాయకులను కలుపుకుపోవడంలో వెంకటరమణ విఫలమయ్యారని రాష్ట్రపార్టీ కార్యదర్శి నీలం బాలాజీ పొలిట్‌బ్యూరో సభ్యునికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేత చదలవాడకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. మొత్తం మీద టీడీపీలో అంతర్గతంగా అగ్గి రగులుకుంటూనే ఉంది.
     
    వెంకటరమణ చుట్టూ కోటరీ
     
    ఎన్నికల బాధ్యతల్లో తన మనుషులకే వెంకటరమణ ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. తన వెంట టీడీపీలోకి వచ్చిన నాయకులను చేరదీస్తున్నారు. దీంతో ఇంతకాలం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు గౌరవం లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే మోహన్, తిరుపతి టౌన్ బ్యాంకు చైర్మన్ పులిగోరు మురళి తదితరులకు ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తున్నారు.
     
    ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వారు గుడ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. వీరు కాకుండా పార్టీ టికెట్టు కోసం ఆశించిన భంగపడిన వెంకటరమణ సామాజికవర్గానికి చెందిన నాయకులను అసలు పట్టించుకోవడం లేదు. దీంతో వారంతా గుర్రుగా ఉన్నారు. బోత్ ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ వంటి నాయకులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఈ పరిణామాలన్నీ తిరుపతి పార్టీలో ఐక్యత నేతిబీరలో నెయ్యి చందంగా మారినట్టు ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
     

>
మరిన్ని వార్తలు