నిజమైన ప్రజాస్వామ్యం లేదు

15 Oct, 2017 16:53 IST|Sakshi

    దేశంలో అసమానత్వం పెరుగుతోంది

     ఉపాధి పనులు గాడి తప్పుతున్నాయి

    జన్మభూమి కమిటీలదే గ్రామాల్లో పెత్తనం

     మూడేళ్లలో 90 మందికి పీఎం రిలీఫ్‌ ఫండ్‌

     మళ్లీ అవకాశమిస్తే దుగ్గరాజపట్నం సాధిస్తా

     ‘మీట్‌ ది ప్రెస్‌’లో తిరుపతి ఎంపీ వరప్రసాద్‌

సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమంటారు. కానీ ఇక్కడ నిజమైన ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. అసమానత్వం పెరిగిపోతోంది. అధికారంలో ఉన్న వారికే దేశ సంపద చెందుతోంది. పేదల పరిస్థితిలో పురోగతి కానరావడం లేదు. రాష్ట్రంలోనూ దాదాపు అదే పరిస్థితి అని తిరుపతి ఎంపీ వెలగపూడి వరప్రసాద్‌ ఆవేదన వెలిబుచ్చారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మూడేళ్ల కాలంలో తిరుపతి లోక్‌సభ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. రాజకీయంగా ప్రజలకు సేవలందించడం పవిత్రమైన వృత్తిగా ఎంపీ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఈ రంగాన్ని చాలా మంది తప్పుగా భావిస్తున్నారన్నారు.

ఈ మూడేళ్ల కాలంలో 1,300 గ్రామాల్లో పర్యటించిన తాను రాజకీయాలకతీతంగా సమస్యలు పరిష్కరించానన్నారు. ఇప్పటివరకూ 90 మందికి ప్రధానమంత్రి రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ.1.50 కోట్ల మేర ఆర్థిక సాయం అందించానని వెల్లడించారు. ఏర్పేడు లారీ దుర్ఘటనలో మృతి చెందిన 17 కుటుంబాలకు రూ.40 లక్షల ఆర్థిక సాయం అందించడం తనకెంతో తృప్తినిచ్చిందని చెప్పారు. ఇకపోతే రైల్వేస్టేషన్ల అభివృద్ధి, కొత్తగా ఆర్‌యూబీల నిర్మాణం, కొత్త రైళ్ల ఏర్పాటు వంటి పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. మురికివాడల అభివృద్ధి, ఇతరత్రా పనుల కోసం ఇప్పటివరకూ రూ.22 కోట్ల ఎంపీ ల్యాడ్స్‌ వినియోగించామని తెలిపారు. త్వరలో తిరుపతి నుంచి మలేషియా, సింగపూర్, దుబాయ్‌ దేశాలకు ఎయిరిండియా విమానం ప్రారంభం కానుందని, ఈ మేరకు విమానయాన శాఖ మంత్రి నుంచి ఆమోదం లభించిందని వివరించారు.

ఉపాధి పనులు గాడి తప్పుతున్నాయి..
దేశమంతా ఉపాధి పనుల కోసం రూ.48 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇందులో మన రాష్ట్రంలో ఈ పనులు అధ్వానంగా జరుగుతున్నాయని తిరుపతి ఎంపీ వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి లోక్‌సభ పరిధిలోని 1,300 గ్రామాల్లోనూ కేవలం 30 శాతం పనులే పేదలకు ఉపాధి కల్పించాయని చెప్పారు. వైఎస్‌ హయాంలో 90 శాతం వేజ్‌ కాంపోనెంట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజలతో చేయించాల్సిన పనులను మెషీన్లతో చేయిస్తున్నారని తెలిపారు. నీరు–చెట్టు పనుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. పంట సంజీవని పనులనూ ఉపాధి పనులుగా చూపించి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు.

గ్రామాల్లో జన్మభూమి కమిటీలదే పెత్తనంగా మారిందని, చివరకు కలెక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. అర్హత గలవారికే ట్రాక్టర్లు ఇవ్వాలని కోరితే కలెక్టర్లు చేతులెత్తేస్తున్నారని తెలిపారు. పేదల భూములను గుంజుకుని కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. జీడీపీ ప్రకటనల్లో మాత్రమే పెరిగిందని, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని తెలిపారు. 1982–83లో దేశసంపద 90 శాతం బీసీలు, ఎస్సీలు అనుభవించారని, ఇప్పుడు 40 శాతానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుబులిటీ రిపోర్టు ఉన్నా దుగ్గరాజపట్నం పోర్టుపై శ్రద్ధ పెట్టడం లేదని ఎంపీ అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు మరోసారి అవకాశమిస్తే దుగ్గరాజపట్నం పోర్టును సాధిస్తానన్నారు.

మరిన్ని వార్తలు