‘సర్వే’శ్వరా..చదువులెలా..

12 Jul, 2016 01:48 IST|Sakshi

తిరుపతి : తిరుపతి మున్సిపల్ స్కూళ్లల్లో విద్యాబోధన అటకెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లల్లో పాఠాలు బోధించే ఉపాధ్యాయులను మున్సిపల్ అధికారులు స్మార్ట్ పల్స్ సర్వేకు కేటాయించారు. 50 మంది ఉపాధ్యాయులను ఇందుకు కేటాయించడంతో ఆయా స్కూళ్లల్లో తరగతులు జరగడం కష్టమైంది. విద్యాబోధన అగమ్యగోచరంగా మారిందని ప్రధానోపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయం విద్యార్థుల ఉజ్వల భవితవ్యంపై ప్రభావం చూపనుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం రాష్ట్రమంతా మూడు రోజుల కిందట ప్రజా సాధికార సర్వేను ప్రారంభించింది. అన్ని పట్టణాల్లోనూ ఈ సర్వే ప్రారంభమైంది. రాష్ట్రంలోని తిరుపతి, కర్నూలు, విశాఖపట్నం వంటి కార్పొరేషన్లతో పాటు మార్కాపురం, కందుకూరు, తెనాలి, వంటి మొత్తం 12 మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో మున్సిపల్ టీచర్లను కూడా ఇందుకోసం కేటాయించారు. మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేసే జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఇతరత్రా అధికారులందరితో పాటు మున్సిపల్ స్కూల్స్‌లో పనిచేసే ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ టీచర్లకు కూడా సర్వే డ్యూటీలు వేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో 50 మందికి ఈ డ్యూటీలు పడ్డాయి. ఒక్కొక్కరికీ ఆరేసి బ్లాకులు కేటాయించారు. విధుల్లో ఉన్న ఉద్యోగికి పూర్తి సమాచారం సేకరించడానికి ఒక్కో ఇంటికి గంట సమయం పడుతోంది. రోజుకు పది ఇళ్లు సర్వే చేయడం గగనమవుతోంది. ఈ లెక్కన చూస్తే కేటాయించిన బ్లాకులన్నీ పూర్తి చేయడానికి  ఒక్కో టీచర్‌కి సుమారు 60 రోజులకు పైనే పట్టేట్లుంది. 50 ఉపాధ్యాయులు 60 రోజుల పాటు స్కూళ్లకు పోకుండా ఉంటే పిల్లలకు పాఠాలు చెప్పేదెవరు, సిలబస్ పూర్తయ్యేదెప్పుడన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సైన్స్, గణితం, ఇంగ్లిష్ వంటి సబ్జెక్టులు చెప్పే ఉపాధ్యాలను, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన నూతన ఉపాధ్యాయులను కూడా మున్సిపల్ అధికారులు సర్వేకు కేటాయించారు. మున్పిపల్ పరిధిలో ఉన్న 30 ప్రాధమిక, 5 యూపీ, 9 ఉన్నత పాఠశాల్లో సుమారు 20 నుంచి 30 పిరియడ్లు జరగడం లేదని సమాచారం. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
 
 మున్సిపల్  టీచర్లను మినహాయించాలి...

 స్మార్ట్ పల్స్ సర్వే విధుల నుంచి మున్సిపల్ టీచర్లను మినహాయించాలి. తిరుపతిలో ఎక్కువ మొత్తంలో బ్లాకులు ఉండటం వల్ల ఒక్కోక్కరికీ ఆరేసి బ్లాకులు కేటాయించారనీ, బ్లాకు 300 ఇళ్ల చొప్పున 1800 ఇళ్ల నుంచి వివరాలున సేకరించడం కష్టం. ఇందుకు రెండు నెలల సమయం అవసరం. ఇదే జరిగితే విద్యార్థులు బాగా నష్టపోతారు. ఎన్, ప్రసాద్, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ నగర అధ్యక్షుడు, తిరుపతి
 
 
మున్సిపల్ డెరైక్టర్‌ను కలిశాం...

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ టీచర్లను సర్వే నుంచి మినహాయించాలని కోరేందుకు మున్సిపల్ డెరైక్టర్‌ను కలవబోతున్నాం. అన్ని మున్సిపాల్టీల్లోనూ మున్సిపల్ టీచర్లను మినహాంచగా, కేవలం తిరుపతిలో మాత్రమే అధికారులు కొనసాగిస్తున్నారు.  ఎస్. రామకృష్ణ, మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు.
 

మరిన్ని వార్తలు