బస్సు టైరు ఢాం..!

26 Apr, 2019 11:03 IST|Sakshi
టైరు పేలడంతో రోడ్డుపై ఆగిపోయిన ఆర్టీసీ బస్సు, మరో బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు(ఇన్‌సెట్‌) పేలిన బస్సు టైరు

ప్రయాణికులకు తృటిలో తప్పిన ముప్పు

తిరుపతి–కాణిపాకం సర్వీసులపై ఆగ్రహం

కాణిపాకం: తిరుపతి నుంచి 60 మంది ప్రయాణికులతో కాణిపాకం వస్తున్న ఆర్టీసి బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వివరాలు.. ఏపీ 10 జడ్‌  0119  నంబరు గల బస్సు తిరుపతి నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 60 మందితో కాణిపాకానికి వస్తూ ప్రమాదానికి గురైంది. ఈ బస్సు కాణిపాకానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా  వెనుక చక్రం ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ప్రయాణికులు హడలిపోయారు. సమీపంలో రోడ్డు పక్కగా విద్యుత్‌ స్తంభం ఉంది. విద్యుత్‌ వైర్లు తగిలి ఉంటే పెను ప్రమాదం సంభవించేదని ప్రయాణికులు చెప్పారు. ఎండ వేడి మూలాన టైరు పేలి ఉంటుందని ఆర్టీసి సిబ్బంది పేర్కొన్నారు. మండుటెండలో టైరు పేలి బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొంతసేపటికి వెనుక వచ్చిన మరో బస్సులో ప్రయాణికులను కాణిపాకానికి చేర్చారు.

కాలం చెల్లిన బస్సులే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు!
తిరుపతి–కాణిపాకం మధ్య ఎక్కువ శాతం ఆర్టీసీ కాలం చెల్లిన బస్సులను ఎక్స్‌ప్రెస్‌ పేరుతో నడుపుతోందని భక్తులు మండిపడుతున్నారు. రోజుకు 10 సర్వీసులతో  వంద ట్రిప్పుల వరకు నిత్యం ఐదు వేల మందిని గమ్యానికి చేరుస్తున్నాయి. అయితే 70 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులుగా పల్లె వెలుగు బస్సులను నడుపుతున్నారని, వీటిని నుంచి వచ్చే శబ్దాలతో రెండు గంటల పాటు తీవ్ర ఇబ్బందుల నడుమ ప్రయాణం చేస్తున్నట్టు  ప్రయాణికులు ఆగ్రహించారు. ఇకనైనా ఆర్టీసీ అధికారులు మంచి కండిషన్‌లో ఉన్న బస్సులనే ఈ మార్గంలో నడపాలని కోరారు.

మరిన్ని వార్తలు