రౌడీషీటర్లలో మార్పునకు  కౌన్సెలింగ్‌

23 Nov, 2019 09:56 IST|Sakshi

నేరాలపై నిరంతర నిఘా

ఎరచ్రందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం

అర్బన్‌ జిల్లా ఎస్పీ గజరావు భూపాల్‌తో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ 

సాక్షి, తిరుపతి : ‘‘నేరాల నియంత్రణకు నిరంతరం నిఘా ఉంచుతాం..తిరుమల–తిరుపతి పవిత్రతకు భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. పంచాయితీలు చేసే పోలీసులపై కఠినంగా వ్యవహరిస్తాం..అక్రమాలకు పాల్పడితే ఎలాంటి వారైనా ఉపేక్షించేది లేదు..’’ అని అర్బన్‌Œ  జిల్లా ఎస్పీ గజరావు భూపాల్‌ స్పష్టం చేశారు. తిరుపతితో పాటు తిరుమల భద్రత, ట్రాఫిక్, భూకబ్జాలు, ఎరచ్రందనం అక్రమ రవాణా అంశాలపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన మాటల్లోనే ...

సాక్షి : తిరుమల, తిరుపతిలో నిఘాను ఎలా బలోపేతం చేస్తారు?
ఎస్పీ : తిరుమల, తిరుపతిలో నిరంతరం నిఘా పటిష్టంగా ఉంచుతాం. ఇప్పటికే నగరంతోపాటు తిరుమలలో సీసీ కెమెరాల నిఘా ఉంది. నిరంతరం బ్లూకోల్ట్స్‌ రక్షక బృందాలు పట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాయి. రాత్రి పూట అనుమానిత వ్యక్తులపై నిఘా ఉంచుతున్నాం. మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేశాం. 

సాక్షి :భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్పీ : శ్రీవారి భక్తులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తాం. ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, అలిపిరి, శ్రీనివాసం, విష్ణునివాసం వంటి వసతి గృహాలు, నగరంలోని చారిత్రాత్మక ఆలయాల వద్ద నిరంతరం పోలీసుల నిఘాతో పాటు పట్రోలింగ్‌ ఉంటుంది.

సాక్షి :పెరిగిపోతున్న దొంగతనాలకు ఎలా అడ్డుకట్ట వేస్తారు?
ఎస్పీ : గతంలో కంటే దొంగతనాలు బాగా తగ్గాయి. దొంగలపై నిరంతరం నిఘా ఉంచి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తాం. ప్రజలు కూడా మాకు సహకరించాలి. ప్రతి ఇంటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిది.

సాక్షి :తిరుపతిలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోంది..
ఎస్పీ :  ట్రాఫిక్‌ నియంత్రణకు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నాం. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ట్రాఫిక్‌ నియమ నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. జనవరి ఒకటి నుంచి హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి. అంతవరకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. 

సాక్షి :  ఈ– చలానాలు సక్రమంగా కడుతున్నారా..?
ఎస్పీ : నగరంలో ఇప్పటి వరకు రూ.1,37,229 చలానాలు నమోదు చేశాం. ఇందులో 45,922 వసూలయ్యాయి. మిగిలినవన్నీ ఇప్పటి వరకు వసూలు కాలేదు. వాటిపై దృష్టి సారిస్తున్నాం. ఇందులో పది కన్నా ఎక్కువ చలానాలు ఉన్న వాహనాలు 51 ఉన్నట్టు గుర్తించాం. ఇందులో 22 వాహనాలు పూర్తిస్థాయిలో చలానాలు చెల్లించాయి. మరో 29 వాహనాలు చెల్లించాల్సి ఉంది. వీరు ఈనెల 25వ తేదీలోపు చెల్లించాలి. లేనిపక్షంలో వారి ఇంటికి వెళ్లి వాహనాలు సీజ్‌ చేస్తాం.

సాక్షి : రోడ్డు ప్రమాదాలు నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేమిటి? 
ఎస్పీ : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. హైవేలలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేస్తాం. 

సాక్షి : ఎరచ్రందనం స్మగ్లర్లను ఎలా కట్టడి చేస్తారు? 
ఎస్పీ :  ఇప్పటికే అర్బ¯న్‌ జిల్లాలో ఎరచ్రందనం అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీనిని మరింత పటిష్టం చేసి, స్మగ్లర్లను కట్టడి చేస్తాం. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. వారు పరివర్తన చెందేలా కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. అలాగే వీరి కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతాం. 

సాక్షి : మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు?
ఎస్పీ :కాలేజీలు, యూనివర్సిటీలు, విద్యాసంస్థలు ఉన్న ప్రాంతాలలో ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌ జరగకుండా విద్యార్థులకు అవగాహన సదస్సులు, కౌన్సెలింగ్‌ నిర్వహిస్తాం. నిరంతర మహిళా రక్షకులతో ఆకతాయిల భరతం పడతాం. 

సాక్షి :  తిరుపతిలో భూ వివాదాల మాటేమిటి? 
ఎస్పీ : భూ వివాదాలకు కారకులైన వారిని గుర్తించడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడం. ఇప్పటికే కార్యాచరణ రూపొందించాం. ఫోర్జరీ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. 

మరిన్ని వార్తలు