తిరుపతి చుట్టు పక్కల మెగా సిటీ: బాబు

20 Sep, 2014 00:53 IST|Sakshi
తిరుపతి చుట్టు పక్కల మెగా సిటీ: బాబు

హైదరాబాద్: తిరుపతిలో కళ్యాణి డ్యాం చుట్టుపక్కల మెగా సిటీని ఏర్పాటు చేయాలని  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం కళ్యాణి డ్యాం చుట్టుపక్కల ఐదు వేల ఎకరాల శేషాచలం అటవీ భూమి డీ నోటిఫికేషన్ కోసం ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నారు. మెగా సిటీలో భూములు కేటాయిస్తే ప్రైవేట్ రంగంలో యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా సిటీ ఏర్పాటునకు ప్రైవేట్ సం స్థలు ముందుకు వస్తాయనేది బాబు అభిప్రాయంగా ఉంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ఐఎంజీ భారత్ అనే క్రీడా సంస్థకు రెండు చోట్ల కారు చౌకగా ఎకరం రూ.50 వేల చొప్పున 850 ఎకరాలను కేటాయించిన విషయం తెలిసిందే.

అదే తరహాలో తిరుపతిలో క్రీడా సిటీకి వందల ఎకరాలను కేటాయించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. తక్కువ ధరకు భూములను కేటాయిస్తే ఇతర దేశాల సంస్థలతో పాటు దేశీయ సంస్థలు కూడా యూనిట్లు ఏర్పాటునకు ముందుకు వస్తాయనేది చంద్రబాబు అభిప్రాయంగా ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో భాగంగానే తిరుపతిలో ఏకంగా ఐదు వేల ఎకరాల్లో మెగా సిటీని ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారనేది అధికార వర్గాలు అభిప్రాయం.
 

మరిన్ని వార్తలు