తిరుమలలో ధన్వంతరి మహాయాగం

20 Mar, 2020 18:06 IST|Sakshi

సాక్షి, తిరుమల : ప్రపంచంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ నెల 26 నుంచి 28 వరకు ధన్వంతరి మహాయాగం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం జరపనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో ప్రపంచం భయభ్రాంతులకు గురవుతోందన్నారు. శ్రీమహావిష్ణువు రూపాలలో సర్వ రోగాలను నయం చేసే ధన్వంతరి రూపం ఒకటని, ఈ యాగం నిర్వహించడం వల్ల మానవాళికి నష్టం కలిగించే వ్యాధులు నయమవుతాయని పేర్కొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర స్వామి, మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠాధిపతి సుబుదేంద్రతీర్థ స్వామి ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహిస్తామని చెప్పారు. కాగా, కరోనా వైరస్‌ నేపథ్యంలో తిరుమలలో భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. 

యథావిథిగా దుర్గగుడిలో హోమాలు..
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శనివారం నుంచి ప్రారంభం కానున్న హోమాలు, పారాయణాలు యథావిథిగా జరుగుతాయని ఆలయ ఈవో సురేష్‌బాబు తెలిపారు. కరోనా నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచి భక్తులకు అనుమతి లేదన్నారు. అమ్మవారికి నిత్య కైంకర్యాలు జరుగుతాయని చెప్పారు. దూరప్రాంతాల నుంచి వచ్చేవారు ఇందుకు సహకరించాలన్నారు. తిరిగి అమ్మవారి దర్శన తేదీలను త్వరలో ప్రకటిస్తామన్నారు. 

కాణిపాకంలో భక్తుల దర్శనాలు నిలిపివేత..
కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆయలంలో భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయం, అనుబంధ దేవాలయాల దర్శనం నిలిపివేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి దేముళ్ళు తెలిపారు. తిరిగి భక్తులను దర్శనానికి అనుమతిచ్చే తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. స్వామివారికి జరిగే నిర్ణీత కాల పూజలు, సర్కారీ సేవలు, యథావిథిగా, శాస్త్రోక్తముగా దేవస్థానం నిర్వహిస్తుందని చెప్పారు. భక్తులు ఇందుకు సహకరించాలని కోరారు.

► కరోనా నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో తిరుమలగా భాసిల్లే వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఏడు శనివారాల ప్రదక్షిణలు, దర్శనాలను ఆలయ నిర్వాహకులు నిలిపివేశారు. 

కరోనా నేపథ్యంలో మెదక్‌ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన ఏడుపాయాల వనదుర్గ మాత ఆలయం శుక్రవారం నుంచి మార్చి 31వరకు మూసివేశారు. 

► కరోనా వైరస్‌ సోకినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మి నరసింహస్వామి దేవాలయంలో భక్తుల దర్శనాలను మార్చి 31వరకు నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈఓ తెలిపారు.

► కరోనా వైరస్‌ ప్రబలకుండా కర్నూలు జిల్లా మహానందీశ్వర స్వామి ఆలయంలో దేవాదాయశాఖ ఆదేశాల మేరకు వేదపండితులు మహా మృత్యుంజయ యాగం చేపట్టారు. 

► కరోనా నియంత్రణలో భాగంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగా పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 20 నుంచి 31వరకు అంతరాలయ దర్శనం రద్దు చేశారు. అమ్మవారి నిత్య కైంకర్య సేవలు కొనసాగనున్నట్టు అర్చకులు తెలిపారు. 

► కరోనా నేపథ్యంలో మెదక్‌లోని సీఎస్‌ఐ చర్చికి భక్తులు రావద్దని బిషప్‌ సల్మాన్‌ రాజ్‌ సూచించారు. 

మరిన్ని వార్తలు