రాజకీయాల్లో హుషారు..తిరువూరు

21 Mar, 2019 08:34 IST|Sakshi
తిరువూరు నియోజకవర్గం నగర పంచాయతీ

సాక్షి, తిరువూరు : జిల్లాకు వాయువ్యంలో కొలువై ఉంది తిరువూరు నియోజకవర్గం. నాలుగు మండలాలు, 71 పంచాయతీలతో  ఉన్న ఈ ప్రాంతం  పశ్చిమ  కృష్ణాలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల చెంతన ఉంది.నియోజకవర్గానికి మూడువైపులా తెలంగాణలోని ఖమ్మం జిల్లా పెనుబల్లి, వేంసూరు, మధిర, కల్లూరు మండలాలున్నాయి.  ఖమ్మం జిల్లా నుంచి పారే కట్లేరు, పడమటివాగు, తమ్మిలేరు, గుర్రపువాగు, వెదుళ్ళవాగులు ఈ నియోజకవర్గంలో ప్రవహించి మున్నేరులో కలుస్తున్నాయి.

నియోజకవర్గంలో 360 సాగునీటి చెరువులు ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచక నిరుపయోగంగా ఉన్నాయి. కృష్ణాజిల్లా కంటే తెలంగాణా ప్రాంతంతోనే ఈ నియోజకవర్గ వాసులకు ఎక్కువ అనుబంధం ఉంది. తిరువూరు ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడింది.  మైలవరం, తిరువూరు నియోజకవర్గాలు అప్పట్లో కలిసి ఉండగా, 1955లో పునర్విభజన చేశారు. 1967లో ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు చేశారు.  

ఇదీ నియోజకవర్గ చరిత్ర 
 2014లో  తిరువూరు నియోజకవర్గాన్ని మూడోసారి పునర్విభజన చేశారు. ప్రస్తుతం చాట్రాయి మండలాన్ని నూజివీడు నియోజకవర్గంలో చేర్చగా, మైలవరం నియోజకవర్గంలో ఉన్న ఏకొండూరు మండలాన్ని పూర్తిగా    తిరువూరులో విలీనం చేశారు.  తిరువూరులో రెండుసార్లు గెలిచిన కోనేరు రంగారావు కంకిపాడులో ఒకసారి గెలిచారు.

గెలిచిన మూడుసార్లు ఆయన మంత్రివర్గంలో పదవి పొందటం ఆయన ప్రత్యేకత.  కోట్ల క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి కూడా నిర్వహించారు.ఇక స్వామిదాస్, కోట రామయ్య, పేట బాపయ్య రెండు సార్లు గెలుపొందారు. విజయవాడ లోక్‌ సభ పరిధిలో తిరువూరు కొనసాగుతోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటర్లు పట్టం కట్టారు. 

తండ్రీ కొడుకుల పోటీ!
1952లో తండ్రి–కొడుకులు పరస్పరం పోటీపడగా కొడుకు పేట రామారావు విజయం సాధించారు. తిరిగి 1955లో తండ్రి పేట బాపయ్య కుమారుడిని ఓడించారు. కుమారుడు సీపీఐ పక్షాన, తండ్రి కాంగ్రెస్‌ తరుపున బరిలో దిగారు.

పాడి పరిశ్రమతో ఉపాధి
మెట్ట ప్రాంతమైన తిరువూరుతో పాటు పొరుగున ఉన్న ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో పాడిపరిశ్రమాభివృద్ధికి లక్ష్మీపురం పాలశీతల కేంద్రం విశేష కృషి చేస్తోంది.  కృష్ణా మిల్క్‌ యూనియన్‌ సహకారంతో రైతులకు పాడిపశువుల సంరక్షణలో శిక్షణ ఇవ్వడం, పాలు మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ బోనస్‌ కూడా చెల్లిస్తున్నారు. దీంతో  50 గ్రామాల్లో పలు కుటుంబాలు పాడి పరిశ్రమనే జీవనాధారం చేసుకుని ముందుకు సాగుతున్నాయి. 

విద్యారంగంలో వెనుకబాటు
ఉన్నత విద్యాభివృద్ధికి గతంలో గెలిచిన ప్రజాప్రతినిధులు పలు ప్రణాళికలు వేసినప్పటికీ అమలుకు నోచలేదు.  ప్రైవేటు రంగంలో తిరువూరులో ఇంజనీరింగ్‌ కళాశాల, విస్సన్నపేటలో పీజీ కళాశాల మినహా ప్రభుత్వ విద్యాసంస్థలు ఏర్పాటు కాలేదు.  తిరువూరులో మహిళా తదితర కళాశాల కోసం  డిమాండ్‌  చేస్తున్నారు.

సెంటిమెంటు తిరగబడింది!
తిరువూరు నియోజకవర్గం ఏర్పడిన నాటినుంచీ ఎప్పుడూ అధికారపక్షం అభ్యర్థి గెలుపొందడమే సంప్రదాయంగా వస్తోంది.  ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజకీయ పండితుల విశ్వాసం.  2014లో ఈ సెంటిమెంటు కాస్త తిరగబడింది.  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రక్షణనిధి ఇక్కడ గెలుపొందినా  టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

వైఎస్‌ హయాంలోనే అభివృద్ది
పలువురు ప్రముఖులు తిరువూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలోనే ఈ నియోజకవర్గంలో పలు శాశ్వత ప్రాజెక్టులకు బీజం పడింది. సాగు, తాగునీటి వెతలు తీర్చడానికి ఎత్తిపోతల పథకాలను వైఎస్‌ ప్రారంభించారు. నాగార్జునసాగర్‌ నీటిపై ఆధారపడిన నూతిపాడు, మాధవరం, తెల్లదేవరపల్లి, ఎత్తిపోతల పథకాలు రాష్ట్ర విభజన తర్వాత నిరుపయోగంగా మారాయి.

మొత్తం జనాభా : 2,58,000
మొత్తం పోలింగ్‌ కేంద్రాలు : 234
మొత్తం ఓటర్లు : 2,05,000
పురుషులు: 99,802
స్త్రీలు : 1,05,191
ఇతరులు : 7
అత్యధిక మెజారిటీ : కోనేరు రంగారావు : 17,300 (2004)

మరిన్ని వార్తలు