టీటీడీ గోడౌన్‌లో మళ్లీ అగ్నిప్రమాదం

4 Sep, 2014 01:22 IST|Sakshi
  •   ఈ ఏడాదిలో అగ్ని ప్రమాదం ఇది రెండో పర్యాయం
  •   213 బస్తాల బియ్యం, 600 బస్తాల బ్లీచింగ్ పౌడర్ బుగ్గి
  •   రూ.8 లక్షల నష్టం
  • తిరుపతి :  టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌లో మరోసారి మంటలు చెలరేగాయి. ఈ ఏడాది జనవరిలో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో 50 కిలోల బియ్యం(మిక్స్‌డ్ రైస్) బస్తాలు 213, 25 కిలోల బ్లీచింగ్ పౌడర్ బస్తాలు 600 అగ్నికి ఆహుతయ్యాయి. వీటితో పాటు తిరుమల అవసరాలకు కొనుగోలు చేసిన 2 వేల కొండ చీపుర్లు, కొన్ని ప్లాస్టిక్ డ్రమ్ములు కాలి బూడిదయ్యాయి.

    వీటి విలువ సుమారు రూ.8 లక్షలుగా అధికారులు అంచనా వేశారు. బియ్యం, బ్లీచింగ్ బస్తాలు నిలువ ఉంచిన రేకుల షెడ్డులో నుంచి ఉదయం 7.30 గంటల ప్రాంతంలో మంటలు ఎగసి పడడాన్ని గుర్తించిన గోడౌన్ కార్మికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పక్కన ఉన్న షెడ్డులో శ్రీవారికి భక్తులు ముడుపుల రూపంలో చెల్లించిన తలనీలాలు నిల్వచేశారు. దానికి మంటలు వ్యాపించి ఉంటే భారీ నష్టం వాటిల్లేది.
     
    కాగా ఈ ఏడాది జనవరిలో ఇక్కడ అగ్నిప్రమాదం జరిగి దాదాపు రూ.3 లక్షల విలువ చేసే గోనెసంచులు కాలిపోయాయి. తిరుమలలో శ్రీవారి ప్రసాదాలు తయారు చేసే పోటు నుంచి పంపిన శెనగపిండి సంచులపై నేతి మరకలు పడి ఉన్నందున అడుగుభాగంలో అవి వేడెక్కడంతో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడూ అదే మాట చెబుతున్నారు. శ్రీవారి కల్యాణోత్సవాలకు భక్తులు సమర్పించిన బియ్యం (తలంబ్రాలకోసం వాడినవి), శ్రీవారికి మొక్కుల రూపంలో హుండీ ద్వారా సమర్పించిన బియ్యాన్ని బస్తాలలో నింపి షెడ్డులో మూడు నెలల క్రితం భద్రపరిచారు.

    బియ్యం బస్తాలు ఉన్న షెడ్డులోనే బ్లీచింగ్ పౌడర్ బస్తాలు పెట్టారు. కెమికల్ రియాక్షన్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంస్థగా పేరున్న టీటీడీకి చెందిన మార్కెటింగ్ గోడౌన్‌లో ఇలా తరచూ అగ్నిప్రమాదాలు జరగడం అనేక విమర్శలకు తావిస్తోంది. దేవుడి సొమ్మే కదా! పోతే పోనీలే అని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

    నిధులకు, భూమికి ఏమాత్రం కొదవ లేనప్పటికీ అధునాతన వసతులతో కొత్తగా గోడౌన్ల నిర్మాణాలు చేపట్టని టీటీడీ అధికారుల వైనాన్ని శ్రీవారి భక్తులు తప్పుపడుతున్నారు. అధికారులు చెబుతున్నట్లుగా కెమికల్ రియాక్షన్ వల్లనే అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయా అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖ ల కు అతిథి భవనాల నిర్మాణాలకు అతి విలువైన భూ ములను ఇస్తున్న టీటీడీ తన అవసరాలకోసం గోదాములు ఎందుకు నిర్మించుకోలేదని ప్రశ్నిస్తున్నారు.
     
    అంచనాలతోనే సరి
     
    టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌కు ఎదురుగా టీటీడీకి చెందిన స్థలంలో గోడౌన్ల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. భవన నిర్మాణాలకు టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు సుమారు 7 కోట్ల రూపాయల అంచనా ఖర్చుతో ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఇది జరిగి ఏడాది దాటినా ఇంత వరకు అతీగతీ లేదు.
     

>
మరిన్ని వార్తలు