పచ్చటి బతుకుల్లో తిత్లీ చిచ్చు

13 Oct, 2018 11:50 IST|Sakshi
తుపాన్‌ ధాటికి శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో నేలకొరిగిన కొబ్బరి చెట్లు

కుప్పకూలిన ఆశలు

తెగిపోయిన 30 ఏళ్ల అనుబంధం

కూకటివేళ్లతో కూలిన జీడి, కొబ్బరి చెట్లు

కడుపు కోతతో రైతుల కన్నీరుమున్నీరు

ఉద్దానం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తిత్లీ తుపాను దెబ్బకు ఉద్దానం ఊపిరాగింది. 30 ఏళ్లుగా చెట్టుతో పెనవేసుకున్న బంధం ఒక్కసారిగా నేలమట్టమైంది. కూకటివేళ్లతో కూలిపోయిన జీడి, కొబ్బరి చెట్ల వద్దే రైతన్న గుండె పగిలేలా రోదిస్తున్నాడు. బిక్కచచ్చి బావురుమంటున్నాడు. ఊళ్లన్నీ శ్మశానాన్ని తలపిస్తున్నాయి. ‘చెట్లు కాదు.. మా ప్రాణాలే పోయాయి’ అంటూ పల్లె జనం ఘొల్లుమంటున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు, పలాస, టెక్కలి మండలాల్లో ఏ ఊరుకెళ్ళినా ఇదే పరిస్థితి. మచ్చుకు ఒక్క చెట్టయినా కన్పించని దారుణమైన విషాదం నుంచి రైతన్న కోలుకోవడం లేదు. తాతలనాడు వేసుకున్న చెట్లు.. పసిపిల్లల్లా పెంచుకున్న వనాలను గుండె చెదిరిన రైతన్న గుర్తుచేసుకుంటూ గగ్గోలు పెడుతున్నాడు. ఉపాధి పోయి ఊళ్లొదిలే పరిస్థితిని చూస్తూ కుమిలిపోతున్నాడు. (అన్నమోరామ‘చంద్రా’!)

గుండె పగిలే దుఃఖం
వజ్రపుకొత్తూరు మండల పరిధిలోని పూడి, రెయ్యిపాడు, ఆర్‌ఎం పురంతో పాటు అన్ని గ్రామాల్లోనూ 90 శాతానికిపైగా జీడి, కొబ్బరి తోటలే ఉన్నాయి. రైతులు, రైతు కూలీలకు ఇవే జీవనాధారం. ఎన్నో ఏళ్లుగా వాళ్లకు వలసలు అంటే ఏంటో తెలీదు. తిత్లీ తుపాను దెబ్బకు ఒక్క చెట్టూ మిగల్లేదు. రెయ్యిపాడుకు చెందిన ఎం. తిరుపతిరావు ఐదెకరాల్లో జీడి, కొబ్బరి సాగుచేస్తున్నాడు. తండ్రి కాలంలో వేసిన చెట్లు నెలకు రూ.30వేల ఆదాయమిస్తున్నాయని చెప్పాడు. ‘ఐదెకరాలూ కొట్టుకుపోయిందయ్యా.. ఏం చెయ్యాలి’.. అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తిరుపతిరావును ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదని ఆయన బంధువు వెంకటరమణ తెలిపాడు. ‘ఆయనేం చేసుకుంటాడో? ఏమవుతాడో?’ అని ఇంటిల్లిపాదీ కుమిలిపోతున్నారని చెప్పాడు. మద్దెల హరినారాయణ అక్కడ జీడి పరిశ్రమ నడుపుతున్నాడు. అతనూ ఓ రైతే. అతన్ని కదిలించినా ఆవేదన తన్నుకొచ్చింది. ‘ఒక్కో చెట్టూ లక్షలు చేస్తుంది. మళ్లీ అంత చెట్టు కావాలంటే ఏళ్లు పడుతుంది. మాకా ఓపిక లేదు.. అంత శక్తీ లేదు. మా నష్టాన్ని ఎవరు పూడుస్తారు? ఒక్కో వ్యక్తికీ రూ.20 లక్షలిచ్చినా కోలుకోలేం’ అని బావురుమన్నాడు. ప్రతీ రైతన్నదీ ఇదే ఆవేదన.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఆదుకోకపోతే ఆత్మహత్యలే..
నిన్నటిదాకా ఈ ప్రాంతంలో ఆకాశాన్ని తాకి, పచ్చగా రెపరెపలాడిన కొబ్బరి చెట్లు.. ఏపుగా ఎదిగిన జీడి చెట్లు తిత్లీ దెబ్బకు పూర్తిగా నేల కొరిగాయి. కూలిన చెట్లను రంపంతో ముక్కలుగా కోస్తుంటే అక్కడ రైతన్న వేదన హృదయ విదారకంగా ఉంది. ఊళ్లకు ఊళ్లే ఎడారిగా మారిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు వాళ్లు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మళ్లీ మొక్కనాటి, పెంచి పెద్దచెయ్యాలనుకుంటున్నారు. కానీ, వారికి సాయం కావాలి. మళ్లీ ఉద్యానవనం పెంచడానికి ప్రభుత్వం కనీసం ఆరేళ్ల పాటు సాయం చేస్తే తప్ప కోలుకోలేమని ఇక్కడి రైతులు చెబుతున్నారు. రైతును ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమయ్యే దుస్థితి రావచ్చని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఒక్కరూ పలకరించలేదు
మా గుండెలు మండిపోతున్నాయి. హుద్‌హుద్‌ తుపాను వస్తే విశాఖను ఆదుకున్నారట. ఎక్కడో కూర్చుని చెప్పడం కాదు. ఇక్కడికి రావాలి. రైతు కష్టాన్ని చూడాలి. నిజాయితీగా ఆదుకునే ఆలోచన చేయాలి. మేం సర్వనాశనమయ్యాం. ఒక్కరూ రాలేదు. పిల్లల్లా పెంచుకున్న చెట్లు కూలిపోయాయి. రోడ్డున పడ్డాం. ఓదార్చే దిక్కేలేదు.
– మద్దెల పాపయ్య, రెయ్యిపాడు, జీడి, కొబ్బరి రైతు

అధికారులు ఎవరూ రావడంలేదు
రైతుకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. రెండు రోజులుగా అదేదీ కన్పించడం లేదు. అధికారులు అస్సలు రావడంలేదు. కూలిన చెట్లను రైతులే తొలగించుకుంటున్నారు. కానీ, అన్ని సహాయ చర్యలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులను పంపితే వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. లేకపోతే ఉద్దానం ఆవేశం ఏంటో ప్రభుత్వం
చూస్తుంది.
– సాంబమూర్తి, సీపీఎం మండల నాయకుడు, వజ్రపుకొత్తూరు

మరిన్ని వార్తలు