ఏ ముఖం పెట్టుకుని వచ్చారు..

16 Oct, 2018 07:19 IST|Sakshi
సీతాపురంలో మంత్రి రవీంద్ర, ఎమ్మెల్యే అల్లుడిని నిలదీస్తున్న తుఫాన్‌ బాధితులు

మంత్రి కొల్లు రవీంద్ర, పలాస ఎమ్మెల్యే అల్లుడికి నిలదీతలు

వాహనాలను అడ్డుకున్న తుఫాన్‌ బాధితులు

మూడు రోజులుగా నరకం చూస్తున్నామని ఆవేదన

వజ్రపుకొత్తూరు రూరల్‌: తిత్లీ తుఫాన్‌ ప్రభావంతో సర్వం కోల్పోయిన తమను ఇన్నాళ్లూ గాలికి వది లేసి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారని మంత్రి కొల్లు రవీంద్ర, పలాస ఎమ్మెల్యే శివాజీ అల్లుడు వెంకన్న చౌదరిని తుఫాన్‌ బాధితులు కడిగి పారేశారు. మండలంలోని గరుడబద్ర, ధర్మపురం, చినవంక, పెద్దబొడ్డపాడు, సీతాపురం గ్రా మాల్లో వారు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా వారికి గ్రామాల్లో బాధితులు అడుగడుగునా నిలదీశారు. తుఫాన్‌ వచ్చిన తర్వాత మూడు రోజులు రహదారుల్లో భారీ వృక్షాలు పడి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని, పసి పిల్లలకు పాలు, నీరు, భోజనం లేక ఆకలికి అలటించామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టలేదని అన్నారు. గ్రామాల్లో ఇళ్లు కూలిపోయి నిలువ నీడ లేకుండా అయిపోయిందని అన్నారు. ఇంతటి విలయం వస్తే కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గరుడబద్రలో పాడైన ఆహార పొట్లాలు అందించారని వాపోయారు. బాధితుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వారు అక్కడి నుంచి జారుకున్నారు.  

మరిన్ని వార్తలు