అడుగడుగునా నిలదీతలు

17 Oct, 2018 07:55 IST|Sakshi

కాశీబుగ్గ : పలాస నియోజకవర్గంలో మంగళవారం తుఫాన్‌ బాధితులను పరామర్శించడానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అడుగడుగునా నిలదీతలు ఎదురయ్యాయి. ఉదయం 11.46గంటలకు పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హెలికాప్టర్‌లో దిగిన చంద్రబాబు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 2, 3వార్డుల మీదుగా కాన్వాయ్‌తో ప్రయాణించగా పలువురు ఎదురు ప్రశ్నలతో ముంచెత్తారు. వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్ర కాలనీలో ప్రవేశించి కొన్ని ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. గ్రామానికి చెందిన తామాడ అప్పారావు గ్రామంతో పడుతున్న సమస్యలు వివరించారు. తక్షణమే ఆదుకోవాలని కోరారు. తక్షణ సాయం అందడం లేదని ఫిర్యాదు చేయడంతో నచ్చజెప్పి జారుకున్నారు.

 తర్లాగడూరు గ్రామం వద్ద బాబు కాన్వాయి ఆపకపోవడంతో వెనుకున్న వాహనాలను అడ్డుకున్నారు. వెనుక వాహనాలు రావడం లేదని తెలిసి సీఎం నిలిచిపోయారు. తిరిగి వారిని రప్పించి మాట్లాడటంతో కాన్వాయ్‌ను విడిచిపెట్టారు. అక్కుపల్లిలో ఉపాధి కోల్పోయామని, దారి చూపాలని చెప్పడంతో అక్కుపల్లికి డయాలసిస్‌ కేంద్రం ఇచ్చి, జట్టీ కట్టిస్తామని హామీలు ఇచ్చారు. కొంతమంది మహిళలు పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పడంతో వారికి ధైర్యంగా ఉండాలని చెప్పి వెళ్లిపోయారు. బైపల్లిలో కొంతమంది యువకులు నిలదీయడంతో తమాషాలు చేస్తున్నారా అంటూ విరుచుకుపడ్డారు. ప్రతిపక్షం వారు పంపించారా అంటూ తప్పించుకున్నారు. బాతుపురంలో రేషన్‌ సరుకులు అందడం లేదని ముఖ్యమంత్రికి విన్నవించారు. అనంతరం డోకులపాడు, తాడివాడ, చినవంక, కిడిసింగి, వజ్రపుకొత్తూరు గ్రామాల్లో ప్రజలతో మాట్లాడారు.

మరిన్ని వార్తలు