పారదర్శకత కోసమే టీజేఎస్‌

13 Jun, 2018 10:56 IST|Sakshi
 మక్తల్‌లో పెద్ద చెరువు పనులను పరిశీలిస్తున్న కోదండరాం తదితరులు 

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ

భూప్రక్షాళనతో అర్హులైన రైతులు నష్టపోతున్నారు.. 

వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తాం..

టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం వెల్లడి

సాక్షి, మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌ : తెలంగాణలో రాజకీయ పార్టీలు ప్రజలే కేంద్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎదిర, టీచర్స్‌ కాలనీ, పాతపాలమూరు, బండ్లగేరిలో మంగళవారం ఆయన పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఎదిరలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు  పార్టీలు ఏర్పడాలే తప్ప స్వార్థరాజకీయాల కోసం కాదన్నారు. పారదర్శకతతో రాజకీయాలను అందించడానికే టీజేఎస్‌ పార్టీని ఏర్పాటుచేశామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల ను ప్రజల్లోకి తీసుకెళ్లి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామన్నారు. తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండానే ఎదిరె పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేశారన్నారు. ఇలా విలీనం చేయడం వల్ల వ్యవసాయం చేసుకునే రైతులకు పన్నుల భారం పడుతుందని తెలిపారు. 


పుస్తకాలు కొత్తవి.. సమస్యలు పాతవి
ప్రభుత్వం రైతులకు అందించిన చెక్కుల పంపిణీలో చాలా మంది రైతులకు అన్యాయం జరిగిందని కోదండరాం పేర్కొన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన పాసు పుస్తకాలు మాత్రమే కొత్తవని, వాటిలో రైతుల పేర్లు సరిగా రాకపోవడం, భూమి పూర్తిస్థాయిలో రికార్డు కాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. రైతులు అంటే ఆర్థికంగా వెనుకబాటు ఉండి, తక్కువ భూమిలో సేద్యం చేసుకునే నిజమైన లబ్దిదారులకు చెక్కులు ఇవ్వడం వల్ల న్యాయం జరుగుతుందన్నారు. చెక్కుల పంపిణీలో అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగే విధంగా టీజేఎస్‌ పార్టీ వెంట ఉంటుందన్నారు. అందుకోసం రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా పర్యటించి చెక్కుల పంపిణీలో ఉన్న లోటు పాట్లు రైతులకు జరిగిన ఇబ్బందిపై ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఈమేరకు పలువురు కోదండరాం సమక్షాన టీజేఎస్‌లో చేరగా, టీచర్స్‌ కాలనీలో ముస్లిం మహిళలకు రంజాన్‌ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీజేఎస్‌ జిల్లా కన్వీనర్‌ రాజేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వసంత నర్సింహులు, నాయకులు మంత్రి నర్సిహ్మయ్య, బాల్‌కిషన్, దేవరాజ్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

  
పాలమూరుపై కేసీఆర్‌ సవతి ప్రేమ 
మక్తల్‌ : సీఎం కేసీఆర్‌ పాలమూరు జిల్లాపై అభివృద్ధిలో  సవతి ప్రేమ చూపిస్తున్నారని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మక్తల్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గతంలో 90శాతం పనులు చేసి కేవలం 10 శాతం పనులు చేయలేదని అన్నారు. ఎన్నికల హామీలను ఏ మాత్రం అమలు చేయలేదని తెలిపారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాలకు ఆవిర్భావ దినోత్సవం రోజున గౌరవించలేదని విమర్శించారు. అంతకు ముందు మక్తల్‌ పెద్ద చెరువులో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఒండ్రు మట్టిని తరలిస్తున్నారని చెప్పగా.. ఈ పనులు రైతుల కోసమా, ఇటుక బట్టీల వ్యాపారస్తుల కోసమా అని ప్రశ్నించారు. టీజేఎస్‌ కన్వీనర్‌ రాజేందర్‌రెడ్డితో పాటు నర్సిములు, సూర్యప్రకాష్, దత్తాత్రేయ, మొద్దు రాములు, పోలప్ప, జంసీర్, అశోక్‌ పాల్గొన్నారు.

  
భూములు లేకుండా చేయడమేనా? 
మాగనూర్‌ (మక్తల్‌) : భూప్రక్షాళనలో జరిగిన అవకతవకల కారణంగా పేదలు తమ భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదమున్నందున  తక్షణమే రికార్డులు పూర్తిస్థాయిలో సరిచేయాలని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం డిమాండ్‌ చేశారు. భూప్రక్షాళనలో నష్టపోయిన రైతుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. మండల కేంద్రంలో రైతులతో  ఫిర్యాదులు స్వీకరించారు. ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన పేద రైతులకు న్యాయం జరగడమేమో కానీ ఉన్న భూమి కోల్పోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. టీజేఎస్‌ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, నర్సిములు, ముదిరాములు, సూర్యప్రకాష్‌ ఉన్నారు. 

మరిన్ని వార్తలు