శ్రీవారి ఆలయానికి భద్రత పెంచండి

10 Dec, 2014 03:56 IST|Sakshi
శ్రీవారి ఆలయానికి భద్రత పెంచండి

* లోక్‌సభలో ఎంపీ పెద్దిరెడ్డి
* మిథున్‌రెడ్డి డిమాండ్

సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి భద్రత మరింత పెంచాలని లోక్‌సభలో రాజం పేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి.. భక్తుల మనోభావాలను పరిరక్షించాలని కోరారు. లోక్‌సభలో మంగళవారం జీరో అవర్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి భక్తులు  రోజూ సగటున లక్ష మంది తిరుమల వేంకటేశ్వరస్వామిని  దర్శించుకుంటున్నారన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారిని కొలుస్తున్నారన్నారు. కొన్ని ఉగ్రవాద సంస్థలు శ్రీవారి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇటీవల జారీచేస్తున్న హెచ్చరికలు భక్తుల్లో ఆందోళన నింపుతున్నాయని వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో శ్రీవారి ఆలయానికి భద్రత కల్పిస్తున్నారని చెప్పారు. శ్రీవారి ఆలయ భద్రతలో కేంద్రం కూడా పాలుపంచుకుంటే బందోబస్తు పటిష్టమవుతుందని సూచించారు.

సెంట్రల్ ఇంటెలిజెన్స్(ఐబీ) వంటి నిఘా సంస్థలు కేంద్రం నేతృత్వంలో పనిచేస్తున్న నేపథ్యంలో.. ఉగ్రవాద కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వానికన్నా కేంద్ర ప్రభుత్వం వద్దే ఎక్కువ సమాచారం ఉండే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భద్రతను కల్పిస్తే ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పు ఉండదన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో తక్షణం కేంద్రం స్పందించి శ్రీవారి ఆలయానికి భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి జీవో అవర్‌లో లేవనెత్తిన ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో బుధవారం గానీ, గురువారంగానీ రాతపూర్వక సమాధానం ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు