వేరుశనగలో చీడ పీడలు నివారించుకుంటే మేలు

12 Sep, 2014 01:47 IST|Sakshi

 తామర పురుగులు : పిల్ల, పెద్ద పురుగులు ఆకులపై పచ్చదనాన్ని గోకి రసాన్ని పీలుస్తాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు ముడుచుకుని మొక్కలు గిడసబారిపోతాయి. ఆకుల అడుగు భాగంలో గోధమ వర్ణంలో మచ్చలు ఏర్పడతాయి.

 పేనుబంక : తల్లి, పిల్ల పురుగులు మొక్కలు, కొమ్మల చివర, లేత ఆకుల అడుగు భాగాన, కొన్ని సందర్భాలో పూతపై గుంపులు గుంపులుగా ఏర్పడి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల మొక్కలు గిడసబారతాయి. ఇది పూత దశలో ఆశిస్తే అంతా రాలిపోతుంది. ఈ పురుగులు తేనె వంటి జిగురు పదార్థం స్రవించడం వల్ల నల్లని బూజు ఏర్పడుతుంది.

 పచ్చదోమ : పిల్ల, తల్లి పురుగులు ఆకు అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చేస్తాయి. మొదట ఆకు అడుగు భాగాన వీ ఆకారంలో పసుపు పచ్చని మచ్చలు ఏర్పడి క్రమేపి ఆకులన్నీ పసుపు రంగులోకి మారతాయి.
 వీటి నివారణ డైమిథోయేట్ 400 మిల్లీలీటర్లు లేదా మిథైల్-ఓ-డెమటాన్ 400 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 320 మిల్లీలీటర్లు మందును 200 లీటర్ల నీటికి కలిపి ఎక రాకు పిచికారీ చేయాలి. అక్షింతల పురుగులు మొక్కకు 1,2 కన్నా ఎక్కువగా ఉంటే క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించాలి.

 కాళహస్తి తెగులు(నులి పురుగులు)
 నులి పురుగులు కంటికి కనిపించవు. వీటిని మైక్రోస్కోప్‌తో మాత్రమే చూడగలం. ఇవి వేరుశనగ పంటపై పిందె, కాయ పెరిగే దశలో కాయలపై ఆశించ డం వల్ల నల్లని మచ్చలు ఏర్పడతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు పిందెలు కాయలు నల్లగా మారి లోపలి గింజలు అభివృద్ధి చెందక ముడతలు పడతాయి. దీని నివారణకు చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలి. పురుగును గమనించిన వెంటనే, నీటి తడిపెట్టిన తర్వాత అంతర వాహిక గులికల మందు వేయాలి.
 
 తిక్క ఆకుమచ్చ తెగులు
 త్వరగా వచ్చే ఆకుమచ్చ తెగులు పంట వేసిన 30 రోజుల తర్వాత కనిపిస్తుంది. ఈ మచ్చలు గుండ్రంగా ఉండి, ఆకు పైభాగాన ముదురు గోధుమ వర్ణం కలిగి ఉంటాయి. ఆకుమచ్చ ఆలస్యంగా వస్తే మచ్చలు చిన్నవిగా, గుండ్రంగా ఉండి, ఆకు అడుగు భాగాన నల్లని రంగు కలిగి ఉంటాయి. కాండం మీద, ఆకు కాడల మీద, ఊడల మీద కూడా మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు నివారణకు  మాంకోజెబ్ 400 గ్రాములు, కార్బండిజం 20 గ్రాములు లేదా క్లోరోథాల్‌నిల్ 400 గ్రాములు లేదా హెక్సాకోనజెల్ 400 మీల్లీలీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 15 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. అంతర పంటగా సజ్జను 7:1 నిష్పత్తిలో వేయాలి.

మరిన్ని వార్తలు