నేడు జిల్లా బంద్

6 Dec, 2013 02:39 IST|Sakshi

అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : సీమాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నంత మాత్రాన రాష్ట్ర విభజన జరగదని అన్నారు.

రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్‌లో వీగిపోతుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మద్దతు ఇవ్వాలని జాతీయ పార్టీల నాయకులను వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి కలిసి విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. ఇప్పటికే పలు పార్టీల నేతల మద్దతు కూడగట్టారని, పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన బిల్లు వీగిపోయేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడతారన్నారు. సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతంతో తెలుగు ప్రజలను వంచించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
 
 విశాలాంధ్ర కోసం ఉద్యమించిన సీపీఐ వేర్పాటు వాదానికి మద్దతు పలకడం, భాషా ప్రయుక్త రాష్ట్రాలతోనే అభివృద్ధి అన్న బీజేపీ, విభజన వాదానికి దన్నుగా నిలవడం రాజకీయ అవకాశవాదానికి పరాకాష్ట అని విమర్శించారు. తెలుగు జాతి సత్తా ఢిల్లీకి చాటిచెప్పే విధంగా శుక్రవారం బంద్‌కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని పిలుపునిచ్చారు. కాగా..రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా శుక్రవారం జిల్లా బంద్ నిర్వహిస్తున్నట్లు సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు కోగటం విజయభాస్కర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.  
 
 ఎస్కేయూ పరీక్షలు వాయిదా
 ఎస్కేయూ, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఆందోళనల దృష్ట్యా శుక్ర, శనివారాల్లో ఎస్కేయూ పరిధిలో జరగనున్న అన్ని రకాల పరీక్షలు వాయిదా వేసినట్లు ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి తెలిపారు.
 

మరిన్ని వార్తలు