ఆర్థిక పురోగతికి ‘స్త్రీనిధి’ అండ

20 Jan, 2016 01:19 IST|Sakshi
ఆర్థిక పురోగతికి ‘స్త్రీనిధి’ అండ

►మహిళలకు కోరిన వెంటనే రుణాలు
►జీవనోపాధి కోసం ఈ ఏడాది  ప్రత్యేక రుణ సదుపాయం
►సద్వినియోగం చేసుకుంటే స్వయం సహాయక సంఘాలకు వరం
►జిల్లాలో స్త్రీనిధికి కోట్ల రూపాయల కేటాయింపు
►అవగాహన లేమితో మూలుగుతున్న నిధులు
►నాలుగో వంతుకు కూడా చేరని రుణ లక్ష్యం

 
పిడుగురాళ్ళ  స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి ‘స్త్రీనిధి’ అండగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2010లో ప్రారంభించిన  స్త్రీనిధి బ్యాంకు ద్వారా కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారు. కానీ దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవం వల్ల జిల్లాలో స్త్రీనిధి ఖాతాలో కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. స్త్రీనిధి బ్యాంకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.122 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు సుమారు 22 శాతం మాత్రమే పంపిణీ జరిగినట్టు సమాచారం. జిల్లాలోని 57 మండలాల్లో 2052 గ్రామ సమాఖ్యలు ఉండగా 478 సమాఖ్యల ద్వారా 2253 సంఘాల సభ్యులు సుమారు రూ.23 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు నెలలు మాత్రమే గడువు ఉండటంతో మిగిలిన 78 శాతం నిధులు ఎప్పటికి సద్వినియోగం చేసుకోవాలనేది ప్రశ్నార్థకంగా మారింది. నిధులు మూలుగుతున్నా, పొదుపు సంఘ సభ్యులు పూర్తి స్థాయిలో వీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.
 
చిరువ్యాపారాలకూ అవకాశం..
 స్త్రీనిధి బ్యాంకు ఈ ఏడాది మహిళల జీవనోపాధి కోసంప్రత్యేక రుణ సదుపాయాన్ని కూడా అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు గ్రూపు ఎంపిక చేసిన సభ్యురాలికి సుమారు రూ.70 వేల రుణం మంజూరు చేస్తారు. ప్రతిపాదన అందిన వారం లేదా పది రోజుల్లోగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. వాటితో బ్యాంకు సూచించిన 300 రకాల వ్యాపారాల్లో ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. ప్రతి మండలంలో ఐదు సంఘాలకు ఈ ఏడాది అవకాశం కల్పించారు. తీసుకున్న రుణం మూడేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది.

రుణం మంజూరు విధానమిదీ..
 రాష్ట్ర ప్రభుత్వం స్త్రీనిధి బ్యాంకును 2010లో         {పారంభించింది.స్వయం సహాయక సంఘాల సభ్యులు కోరిన రెండు రోజుల్లోనే సాధారణ రుణం మంజూరు చేస్తుంది. వ్యాపారం, చదువు, పిల్లల వివాహాలతో పాటు వ్యవసాయ పెట్టుబడుల కోసం పొదుపు గ్రూపులోని ఒక్కొక్కరికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తారు.  రుణం కోసం గ్రామ సమాఖ్య ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. సంఘంలో పది మంది ఉంటే అందులో ఆరుగురికి మాత్రమే రుణం మంజూరు చేస్తారు.  అవసరమైతే జీవనోపాధి కోసం మిగిలిన వారికి కూడా ఇస్తారు.  మొదటి సారిగా ఒక్కో గ్రూపునకు లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు రుణం ఇస్తారు.  ఒక్కో సభ్యురాలికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు మంజూరు చేస్తారు.  రుణం తీసుకునే ముందుకు సంఘం సభ్యులు నెలకు రూ.10 చొప్పున ఏడాది కాలం పొదుపు చేసి బ్యాంకులో డిపాజిట్ చేసి ఉండాలి. బ్యాంకు పొదుపు చేసిన డబ్బులకు వడ్డీ కూడా చెల్లిస్తుంది.  సంఘం సభ్యులు తీసుకున్న రుణం 14 శాతం వడ్డీతో కలుపుకుని రెండేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది.
 
వడ్డీ బాధలు లేకుండా వ్యాపారం అభివృద్ధి చేసుకున్నా..
నాలుగేళ్లుగా చీరల వ్యాపారం నిర్వహిస్తున్నాను. పొదుపు గ్రూపులో ఏడేళ్లుగా ఉన్నాను. మొదట రూ.50 వేలు రుణం తీసుకుని చీరెల వ్యాపారం ప్రారంభించాను. ఇప్పుడు రూ.1.50 లక్షలతో వ్యాపారం అభివృద్ధి చేసుకున్నాను. స్త్రీనిధిలో తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవడం వల్ల తీర్చుకోవడానికి కూడా సులభంగా ఉంది. తీసుకున్న రుణాలను నిదానంగా చెల్లించుకునే వెసులుబాటు కూడా ఉంది. అధిక వడ్డీల బాధ లేకుండా పొదుపు సంఘాల ద్వారా డబ్బులు తీసుకుని వ్యాపారాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకుంటున్నాను.
 - వి.మల్లేశ్వరి,
 శ్రీలక్ష్మి మహిళా పొదుపు సంఘం, పిడుగురాళ్ళ
 
ఆర్థికంగా వెసులుబాటు కలిగింది..
2006 నుంచి పొదుపు గ్రూపులో ఉన్నాను. నా గ్రూపులో పది మంది ఉన్నారు. వారిలో కొంతమందికి స్త్రీ నిధి ద్వారా రుణాలు తీసుకున్నాం. లోను డబ్బులతో నాలుగేళ్లుగా కిరాణా షాపు నిర్వహిస్తున్నాను. దీంతో కుటుంబం గడుస్తుంది. వ్యాపారంతో ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఇబ్బంది లేకుండా స్వతంత్య్రంగా నలుగురితో పాటు జీవించగలుగుతున్నాను.
 - గంధం కుమారి, కల్యాణి పొదుపు గ్రూపు, పిడుగురాళ్ళ
 
కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు..
స్త్రీ నిధి ద్వారా వ్యక్తిగత లోను రూ.70 వేలు తీసుకుని కూరగాయల వ్యాపారం పెట్టుకున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ రుణం పొందడంతో వ్యాపారం పెట్టుకోగలిగాను. తద్వారా వచ్చే ఆదాయంతో పొదుపు, లోను డబ్బులను ప్రతి నెలా చెల్లిస్తూ కుటుంబ పోషణకు ఇబ్బందిగా లేకుండా చేసుకుంటున్నాను. శ్రీ చెన్నకేశవ పొదుపు గ్రూపులో ఆరేళ్లుగా సభ్యురాలిగా ఉన్నాను. ఈ ఏడాది లోను తీసుకుని కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాను.
 - యక్కల దేవి హేమలత,
 నేతాజీనగర్, శ్రీ చెన్నకేశవ పొదుపు గ్రూపు, పిడుగురాళ్ళ
 
 

మరిన్ని వార్తలు