ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగు పరచండి

9 Oct, 2014 01:47 IST|Sakshi
  • జనరిక్ మందుల అమ్మకానికి చర్యలు
  •  ఏపీ వైద్యవిధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ కనకదుర్గమ్మ
  • నర్సీపట్నం టౌన్ :  రాష్ట్రంలో 30 ఆస్పత్రుల స్థాయి  పెంపునకు చర్యలు చేపడుతున్నామని ఏపీ వైద్య విధాన పరిషత్ రాష్ట్ర కమిషనర్ పి.కనకదుర్గమ్మ  తెలిపారు.  క్షేత్రస్థాయి సర్వేలో భాగంగా జిల్లాలోని పలు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా  బుధవారం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు. చిన్న పిల్లల వార్డు ఆపరిశుభ్రంగా ఉండటంపై సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. డబ్బులు ఉండి ఆస్పత్రిలో అవసరమైన పరికరాలు ఎందుకు కొనుగోలు చేయలేదని సూపరింటెండెంట్ దొరను నిలదీశారు.

    గర్భిణుల ప్రాథమిక తనిఖీ సమయంలో ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించిన నివేదికను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు పంపడం ద్వారా మాతా శిశు మరణాలు తగ్గించవచ్చని గైనకాలజిస్టులు డాక్టర్ సుధాశారద, విజయశాంతిలకు సూచించారు. ప్రసూతి విభాగంలో పుట్టిన వెంటనే బిడ్డలను సంరక్షించే విధానాలపై సరైన అవగాహన లేకపోవడాన్ని గుర్తించి, నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. అన్ని కేసులును విశాఖపట్నం రిఫరల్ కాకుండా సాధ్యమైనంత వరకు వైద్యం అందించాలన్నారు.

    మత్తు డాక్టర్ కొరత ఉన్నప్పుడు ఆస్పత్రి ఆభివృద్ధి నిధులతో అవుట్‌సోర్సింగ్‌లో నియమించుకోవచ్చన్నారు.  దంత, కళ్లు విభాగంలో అవసరమైన పరికరాలు కొనుగోలుకు ఆదేశించారు. అత్యవసర వార్డులో అత్యావసర మందులు, పరికరాలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. పారిశుద్ధ్యానికి అవసరమైన వస్తువులను వినియోగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బందిని పరుగులెత్తించారు. కాంట్రాక్టర్ అమర్‌నాథ్‌తో ఫోన్‌లో మాట్లాడి పారిశుద్ధ్యం మెరుగు విషయంలో పద్ధతి మార్చుకోకపోతే పని మానేయండని హెచ్చరించారు.

    అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో 30 ఆస్పత్రుల వరకు స్థాయిని పెంచేందుకు సిద్ధం చేసిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద ఉందన్నారు. ఏరియా ఆస్పుత్రుల్లో  నిపుణులైన వైద్యుల కొరత అధికంగా ఉండడంతో. పిహెచ్‌సీల్లో పని చేస్తున్న నిపుణులైన వైద్యులను తమకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. జనరిక్ మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమ్మేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆమె వెంట జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, ఎంపీపీ సుకల రమణమ్మ ఉన్నారు.
     
    వైద్యుల ఖాళీలు భర్తీ

    అనకాపల్లి టౌన్ : రాష్ట్రంలోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులలో ఖాళీగా ఉన్న 200కు పైగా వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ పి. కనకదుర్గమ్మ తెలిపారు. ఇక్కడి ఎన్టీఆర్ వందపడకల ఆస్పత్రిని బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు, పారిశుద్ధ్యం నిర్వహణపైన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ  నర్సీపట్నం, కోటవురట్ల ఆస్పత్రులను కూడా పరిశీలించామన్నారు. అనకాపల్లి ఆస్పత్రిలో సిబ్బంది కొరతను తీరుస్తామన్నారు. 13 జిల్లాల్లో 118 వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులున్నాయని, వీటిలో స్పెషలిస్టుల కొరత ఉందని, వీటి భర్తీకి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.  జిల్లా హెల్త్ సొసైటీ నుంచి ఆస్పత్రికి రూ.10 లక్షల వరకు ఆస్పత్రి అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నామన్నారు.
     
    సమస్యలు పరిష్కరించాలని వినతి

    ఏపీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ట్రెజరీ ద్వారా తమకు కూడా సకాలంలో జీతాలు చెల్లించాలని కోరారు. జనరల్ ట్రాన్స్‌ఫర్లు, హెల్త్ కార్డులు, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కమిషనర్‌ను కలిసిన వారిలో ఏపీ వైద్య విధాన పరిషత్ స్టేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎగ్జిక్యుటివ్‌మెంబర్ బి.ఎ. రామ్మూర్తి, జిల్లా ప్రెసిడెంట్ ఎ. సింహాచలం, జనరల్ సెక్రటరీ బి.సోమేశ్వరరావులు ఉన్నారు.
     

మరిన్ని వార్తలు