ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచండి

23 Dec, 2013 02:26 IST|Sakshi

గుడ్లూరు, న్యూస్‌లైన్: ఉపాధ్యాయులు అకింతభావంతో పని చేసి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని డీఈఓ రాజేశ్వరరావు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ జిల్లా స్థాయి విద్యా చైతన్య సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకపోవడంతోనే పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై అభద్రతభావాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుపై ఉందన్నారు.

అక్షర ప్రకాశంలో ప్రతి ఉపాధ్యాయుడూ భాగస్వామి కావాలని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి కాలానికి అనుగుణంగా విద్యా రంగాన్ని సంస్కరించాలన్నారు. స్వార్థ ప్రమోజనాల కోసమే రాష్ట్రాన్ని విడదీస్తున్నారని మండిపడ్డారు. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటంలో యూటీఎఫ్ ముందుందని చెప్పారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ సమైక్యం కోసం పోరాడని సీమాంధ్ర రాజకీయ నాయకులకు పదవుల్లో కొనసాగే అర్హత లేదన్నారు. విద్యలో జిల్లా వెనకబడి ఉందని చెప్పారు.

ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. అనంతరం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామిరెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త తూమాటి మాధవరావు ప్రసంగించారు. సదస్సులో డిప్యూటీ డీఈఓ చాంద్‌బేగం, పీఈఓ వెంకట్రావు, ఎంఈఓ సుధాకరరావు, ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ కరస్పాండెట్ కంచర్ల రామయ్య, దివి శ్రీనివాసులు నాయుడు, రమణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, జాన్ విలియం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు