అన్నదానానికి హాస్టల్ విద్యార్థులు...

16 Apr, 2016 01:27 IST|Sakshi

వీరఘట్టం (నీలానగరం) : పలు సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు పలు ఉత్సవాల సమయంలో గ్రామాల్లో  జరుగుతున్న అన్నదానాలకు వెళ్తున్నారు. ఇందుకు సంబంధిత అధికారులు కూడా సహకరిస్తున్నారు. అరుుతే హాస్టళ్లలో మాత్రం ఆ పూట విద్యార్థులకు భోజనం పెడుతున్నట్టు రికార్డుల్లో చూపిస్తూ బిల్లులు కాజేస్తున్నారు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా నీలానగరంలో శుక్రవారం జరిగిన అన్నదాన కార్యక్రమానికి గ్రామంలోని హాస్టల్ విద్యార్థులు వెళ్లారు. అయితే హాస్టల్‌లో భోజనం వండినట్టు చూపించారు. సెలవు రోజు విద్యార్థులను హాస్టళ్లలో ఉంచి ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి తర్ఫీదు ఇవ్వాలి. అందుకు విరుద్దంగా శుక్రవారం నీలానగరం హాస్టల్‌ను ఉదయం 9 గంటలకు సాక్షి వెళ్లినపుడు ఒకే ఒక విద్యార్థి ఉన్నాడు. మిగిలిన విద్యార్థులేరి అని అడిగితే నీలానగరం, కుమ్మరిగుంట గ్రామాల్లో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి వెళ్లినట్టు తెలిపాడు.
 
ఇదీ విషయం...
నీలానగరంలో అధునాతన హంగులతో ఎస్సీ బాలుర వసతి గృహాన్ని నిర్మించారు. ప్రత్యేక హాస్టళ్లు ఎత్తి వేయడంతో ఇక్కడ మూడు నుంచి 9వ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 40 మంది విద్యార్థులున్నారు. వీరిలో సగం మంది స్థానికంగా ఉన్నవారు కావడంతో రాత్రి ఇక్కడ 20 నుంచి 25 మంది విద్యార్థులు మాత్రమే ఉంటున్నట్లు పలువురు చెబుతున్నా. గ్రామంలో అప్పుడప్పుడు గ్రామంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమాలకు విద్యార్థులు హాజరు కావడం పరిపాటిగా మారింది.  

అధికారులు మాత్రం  హాస్టళ్లలోనే విద్యార్థులు  భోజనం చేస్తున్నట్లు బిల్లులు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు పర్యవేక్షించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై వార్డెన్ జోగినాయుడును సాక్షి అడుగ్గా శుక్రవారం మధ్యాహ్నం 25 మంది విద్యార్థులు హాస్టల్‌లోనే భోజనం చేసినట్టు చెప్పడం విశేషం.
 
అన్నదానానికి వెళ్ళారు..
ఉదయం హాస్టల్‌లో భోజనం చేసి అందరూ కుమ్మరిగుంట, నీలానగరంలో జరుగుతున్న అన్నదానం కార్యక్రమానికి వెళ్లారు. నేను కూడా వెళ్తున్నాను.
- ఆర్.రాజు, 8వ తరగతి విద్యార్ధి, ఎస్సీ హాస్టల్ విద్యార్థి, నీలానగరం
 
ఊరులో భోజనాలు ఉన్నాయి...
ఊరులో శ్రీరామనవమి సందర్భంగా అన్నదానం జరుగుతున్నందున పిల్లలంద రూ ఊరులోకి భోజనాలకు వెళ్ళారు. అందుకే మధ్యాహ్నం వంట చేయలేదు.
- పి.సురేష్, వంట మనిషి

మరిన్ని వార్తలు