రైతుల కోసం దేనికైనా సిద్ధం

30 Dec, 2013 03:16 IST|Sakshi

 నందికొట్కూరుటౌన్/రూరల్, న్యూస్‌లైన్: కేసీ ఆయకట్టు రైతుల సంక్షేమం కోసం దేనికైనా సిద్ధమని నంద్యాల ఎమ్పీ ఎస్పీవై రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఎమ్పీతో పాటు రైతులు మల్యాల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. కేసీకి సకాలంలో నీరు విడుదల కాని పక్షంలో హంద్రీనీవా కాల్వ నుంచి మళ్లించే విషయమై చర్చించారు. రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో హంద్రీనీవాకు నీటి పంపింగ్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ సందర్భంగా కొందరు రైతులు కాల్వకు గండి కొట్టి పైపుల ద్వారా నీరు ఇవ్వాలని పట్టుబడటంతో ఎమ్పీ వారిని వారించారు.

 అనంతరం ఆయన మాట్లాడుతూ సుంకేసుల నుంచి శనివారం 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని, ఇప్పటికే కర్నూలు దాటి ఉంటాయన్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు 10 రోజులకు ఒక్కసారి నీటిని విడుదల చేస్తే రైతుల పంటలు దాదాపు చేతికి అందుతాయన్నారు. ఆతర్వాత మార్చిలో 1 టీఎంసీ నీరు అవసరం ఉంటుందని, ప్రభుత్వంతో పోరాడి విడుదల చేయిస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. ఒక వేళ నీరు రాకపోతే హంద్రీకాల్వ గురించి ఆలోచన చేద్దామన్నారు.

కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పనులు సకాలంలో పూర్తయింటే రైతులు సాగునీటి కష్టాలు తప్పేవన్నారు. తమ పొలాలకు నీరివ్వకుండా అనంతపురానికి తరలిస్తే సహించేది లేదని రైతులు నినాదాలు చేశారు. ఎమ్పీ వెంట పాటు కేడీసీపీ మాజీ చైర్మన్ కాతా అంకిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కన్వీనర్ ఐజయ్య, నాయకులు మాండ్ర శివానందరెడ్డి, బండి జయరాజు, పిడతల దేవరాజు, కట్టమంచి జనార్దనరెడ్డి ఉన్నారు.
 పోలీసుల బందోబస్తు:
 హంద్రీనీవా కాల్వకు గండి కొట్టి కేసీకీ నీటిని మళ్లిస్తామని ముందు నుంచి రైతులు చెబుతుడటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్పీతో పాటు భారీగా రైతులు మల్యాల ఎత్తిపోతల పథకానికి చేరుకున్నట్లు సమాచారం అందుకున్న ట్రైనింగ్ డీఎస్‌పీ నర్మద, ఎస్‌ఐ గంగానాథ్‌బాబు, 15 పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అధికారులతో మాట్లాడి సమస్యను సామరష్యంగా పరిష్కరించుకోవాలని రైతులకు సూచించారు.

మరిన్ని వార్తలు