వంద రోజులు పని కల్పించాలి

2 Jan, 2014 04:52 IST|Sakshi

ఇంద్రవెల్లి, న్యూస్‌లైన్ : ఉపాధి హామీ కూలీలకు వంద రోజులు పని కల్పించాలని, అప్పుడే సిబ్బందికీ పని కల్పించడం సాధ్యమవుతుందని కలెక్టర్ అహ్మద్ బాబు అన్నారు. మండలంలోని దస్నాపూర్ పంచాయతీ పరిధి పిట్టబొంగరం గ్రామంలో న్యూఢిల్లీకి చెందిన ఎన్వీరాన్‌మెంట్ , ఫుడ్‌సెక్యూరిటీ స్వచ్ఛంద సంస్థ డెరైక్టర్ డాక్టర్ పరశురాంరాయ్ ఆధ్వర్యంలో బుధవారం ఉపాధి హామీ పథకం అమలు తీరు, పనులతో రై తులు పొందుతున్న లబ్ధిపై పరిశీలన కార్యక్ర మం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ కూలీకి వంద రోజులు పని కల్పిస్తూనే రైతుల వ్యవసాయ భూముల అభివృద్ధి పనులకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో రోడ్డు సౌకర్యానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కోసం రూ.75 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. ఇంద్రవెల్లిలో పోలీసు కాల్పుల్లో గాయపడిన తనను ఆదుకోవాలని పిట్టబొంగరం గ్రామానికి చెందిన కినక మాన్కుబారుు కలెక్టర్‌కు వినతిపత్రం అందించగా, ఆశ్రమ వసతి గృహంలో వర్కర్ ఉద్యోగం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం సంస్థ డెరైక్టర్ పరుశురామ్‌రాయ్ ఆధ్వర్యంలో దస్నాపూర్ పంచాయతీ పరిధిలో చేపట్టిన పనుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులతో రైతులు పొందుతున్న లాభాలను తెలుసుకున్నారు. ఈజీఎస్ అధికారులు తమ వ్యవసాయ భూముల్లో అభివృద్ధి పనులు చేయకపోతే వారిని నిలదీసే అధికారం రైతులకు ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.  
 ‘ఉపాధి’ చెల్లింపుల పరిశీలన
 మండల కేంద్రంలోని పోస్టాఫీసులో బయోమెట్రిక్ విధానంలో ఉపాధి హామీ చెల్లింపులు, పింఛన్ల తీరును కలెక్టర్ అహ్మద్‌బాబు పరిశీలించారు. లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. సమస్యలుంటే ఉన్నతాధికారులను సంప్రదించి పరిష్కరించాలని సూచించారు. వివరాలు రోజువారీగా రిజిస్టర్‌లో నమోదు చేయూలన్నారు. చెల్లింపుల్లో జాప్యం నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, కూలీలు సహకరించాలని కోరారు. ఆహార భద్రత సంస్థ అసిస్టెంట్ డెరైక్టర్ ప్రకాశ్, డ్వామా పీడీ వినయ్‌కృష్ణారెడ్డి,అదనపు పీడీ గణేశ్, ఉట్నూర్ క్లస్టర్ ఏపీడీ అనిల్ చౌహాన్, ఎంపీడీవో రమాకాంత్, తహశీల్దార్ సూర్యనారాయణ, ఏపీవో చంద్రయ్య, ఏపీఎం మల్లేశ్, ఐటీడీఏ మాజీ చైర్మన్ సిడాం భీంరావ్, పిట్టబోంగరం గ్రామ పటేల్ వెట్టి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
 ఇద్దరం సన్యాసులమే..
 ‘వేర్వేరు కారణాలతో పెళ్లికి దూరంగా ఉన్న మనమిద్దరం సన్యాసులమే.’ అని న్యూఢిల్లీకి చెందిన సంస్థ డెరైక్టర్ పరశురామ్‌రాయ్ పిట్టబొంగరం వాసి కినక మాన్కుబారుుతో అన్నారు. పోలీసు కాల్పుల్లో గాయపడి పెళ్లికి దూరంగా ఉన్న ఆమెనుద్దేశించి మాట్లాడారు. ఇద్దరం అన్నాచెల్లెళ్లలాంటివారమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు