కార్మికుల పోరాటానికి వైఎస్సార్‌సీపీ మద్దతు

15 Jul, 2015 03:01 IST|Sakshi
కార్మికుల పోరాటానికి వైఎస్సార్‌సీపీ మద్దతు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
 
 కడప కార్పొరేషన్ : మున్సిపల్ కార్మికుల సమ్మెకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న కార్మికులకు ఆయన మేయర్ సురేష్‌బాబు, కార్పొరేటర్లతో కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులకు, ప్రభుత్వానికి సంబంధం లేదని, 10వ వేతన సంఘం సిఫారసులు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వర్తించవని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడం అన్యాయమన్నారు.

కార్మికుల డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకూ వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మేయర్ కె. సురేష్‌బాబు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపడం దారుణమన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలకు ఇబ్బంది కలగకుండా తాగునీటి సరఫరా, వీధిదీపాలకు సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎంపీ సురేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సానపురెడ్డి శివకోటిరెడ్డి, జేసీబీ పీటర్స్, చినబాబు, చైతన్య, నాగమల్లిక, జమ్మిరెడ్డి, కె. బాబు, ఎంఎల్‌ఎన్ సురేష్,  కో ఆప్షన్ సభ్యులు నాగమల్లారెడ్డి, టీపీ వెంకటసుబ్బమ్మ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు