లాంచీ ‘కొండె’క్కనుందా?

16 May, 2014 03:32 IST|Sakshi
లాంచీ ‘కొండె’క్కనుందా?

బుద్దవనం బహుభారం
- హిల్‌కాలనీ నుంచి నడిపితే మేలు
- విభజన లోపే చర్యలు తీసుకుంటే మేలు

నాగార్జునసాగర్, న్యూస్‌లైన్: పర్యాటక ప్రాంతంగా ప్రఖ్యాతి గాంచిన నాగార్జునసాగర్‌లో రాష్ట్ర విభజన అనంతరం లాంచీలు ఎక్కాలంటే ఇబ్బందులు తప్పేలాలేవు. లాంచీ ఎక్కి నాగార్జునకొండ చూడాలంటే గుంటూరు జిల్లాకు చెందిన రైట్‌బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనబోతుంది. ఈ నేపథ్యంలో విభజన జరిగేలోపే నల్లగొండ జిల్లా పరిధిలోని హిల్‌కాలనీ నుంచి లాంచీలను నడపితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని పర్యాటకులు సూచిస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో పర్యాటక ప్రాంతంగా నాగార్జునసాగర్ రూపుదిద్దుకుంది.

ఏపీటీడీసీ (ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ) నుంచి టీజీ టీడీసీగా(తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ)గా విడిపోయి నూతనంగా రిజిస్ట్రేషన్ కాబోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో సాగర్ పర్యాటక డివిజన్‌లో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది. సాగర్‌ను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు లాంచీ ఎక్కి నాగార్జునకొండకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు.   తప్పుదోవ పట్టిస్తున్న కన్సల్టెంట్ పర్యాటక అభివృద్ధి సంస్థలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి లాంచీలు నడిపే విషయంలో అధికారులను తప్పుదోవ పట్టించినట్లు సమాచారం. నాగార్జునకొండతో పాటు ఏలేశ్వరం ప్రాంతాలకు బుద్ధవనం నుంచి లాంచీలు నడపాలని ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలిసింది. కానీ, అది సాధ్యం కాదన్నది కన్సల్టెంట్‌కు తెలిసిన విషయమే.

ఎందుకంటే బుద్ధవనం నుంచి జలాశయం తీరానికి వెళ్లి లాంచీ ఎక్కాలంటే పర్యాటకులు కనీసం ఐదుకిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి లాంచీలు నడపాలంటే.. దట్టమైన అడవి కలిగిన ప్రాంతం కాబట్టి పోలీసుల అనుమతి కావాల్సి ఉంటుంది. దేశరక్షణకుగాను కోసం నిత్యం ప్రయోగాలు నిర్వహించే నావికాదళం స్టేషన్ కూడా ఇక్కడ ఉంది. అది దాటి లాంచీలు వెళ్లాలి. ప్రస్తుతం చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల పుట్టీలనే అక్కడి నుంచి రానివ్వరు. దేశ రక్షణ దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి లాంచీలను కూడా అనుమతి నివ్వరు. అదీ కాకుండా పర్యాటకుల రక్షణకుగాను ఆరుబయటి ప్రదేశం కావాలి. నావికాదళం వారు దేశ రక్షణ దృష్ట్యా ఇటు నుంచి రోడ్డునే బ్లాక్ చేయాలనే ప్రతిపాదనను ఢిల్లీకి పంపారు. బైపాస్ రోడ్డువేస్తే ఇటు ప్రత్యేకంగా పర్యాటకులు రావాల్సిందే తప్ప ఏవాహనాలు ఇక్కడి నుంచి వెళ్లవు.

లాంచీస్టేషన్ నిర్మాణం ఇప్పట్లో సాధ్యం కాదు
ఇప్పటికిప్పుడు కొత్తగా లాంచీలు ఏర్పాటు చేయడం, జట్టీ నిర్మాణం చేయడం అంత సులువైన పనికాదు.  తెలంగాణ రాష్ట ఏర్పాటు అనంతరం లాంచీలు నడపాలంటే అనుమతుల కోసం కేంద్రం చుట్టూ తిరగాలి. ఒక లాంచీ నిర్మాణం కావాలంటే కోటిన్నర అవసరమవుతాయి. కనీసం రెండు సంవత్సరాల కాలం పడుతుంది. అన్నింటికి అన్ని ఉండి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నాగసిరి లాంచీ నిర్మాణం ప్రారంభమై మూడున్నర సంవత్సరాలైనా ఇంకా ఓకొలిక్కిరాలేదు. ఇప్పటి వరకు దీని కోసం రూ. 1.30 కోట్లు ఖర్చుచేశారు. మరో రూ.30లక్షలు వరకు అవసరం ఉన్నాయి. అదేమీ లేకుండా అపాయింటెడ్ డేకు ముందుగానే బుద్ధపూర్ణిమ ఉత్సవాలలో భాగంగా హిల్‌కాలనీ నుంచే లాంచీ లను ప్రారంభించాలని పర్యాటకులు  కోరుతున్నారు.

పుష్కరఘాట్ నుంచి..
బుద్ధవనం నుంచి లాంచీలు నడపాలన్న ప్రతిపాదనలు మానుకోవాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఆరు లాంచీలలో మూడింటిని తెలంగాణ వాటాకింద తీసుకుని హిల్‌కాలనీలోని డౌన్ పార్కు వద్ద నిర్మించిన పుష్కర ఘాట్ నుంచే నడపడానికి వీలుగా ఉందని వారు పేర్కొంటున్నారు. బైపాస్ రోడ్డువేసినా ఆ రోడ్డు డౌన్‌పార్కు సమీపం నుంచే వెళ్తుంది. రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. హిల్‌కాలనీ బస్టాండుకు నడిచి వెళ్లేంత దూరంలోనే ఉంటుంది. ఎంతో అనువైన ప్రదేశం. అన్ని పర్యాటక యూనిట్లు కలిసి ఉండే కంటే మరో యూనిట్ ఏర్పాటవుతుంది.

ఉద్యోగాల సంఖ్యా  పెరుగుతుంది. రెండుచోట్ల టికెట్లు విక్రయించడం వల్ల పర్యాటక శాఖకు ఆదాయం పెరుగుతుంది. పర్యాటకులకు రెండు ప్రాంతాలను చూసిన అనుభూతి కలుగుతుంది. రక్షణ దృష్ట్యా డౌన్‌పార్కు నుంచి నాగార్జునకొండకు వెళ్లేంత వరకు లాంచీలు కనిపిస్తాయి. కొండకు వెళ్లడానికి బుద్ధవనం నుంచి వెళ్లిన దాని కన్నా నీటిపై ప్రయాణం తగ్గుతుంది. నాగార్జునకొండకు వెళ్లడానికి వచ్చే పర్యాటకుల్లో ఎక్కువ మంది తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేవారే ఉంటారు. వారికి చుట్టూ తిరిగి వెళ్లడం తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. ఏడాదిలో రూ. 1.30 కోట్ల ఆదా యం లాంచీస్టేషన్‌కు వస్తే ఇందులో తెలంగాణ ప్రాంతీయు ల నుంచి వచ్చిన రెవెన్యూ రూ. కోటి ఉంటుందని పర్యాటకశాఖ అధికారుల అంచనా. గతంలో ఎన్‌ఎస్‌పీ పరిధిలో లాంచీలు ఉన్నప్పుడు కూలీలలను నాగార్జునకొండకు ఇక్కడి నుంచి తీసుకువెళ్లినట్లుగా నాటి ఉద్యోగులు తెలిపారు.

మూడు లాంచీలు తీసుకుని..
సాగర్‌లో ఒకప్పుడు ఆరు లాంచీలు ఉండేవి. అందులో విజయలక్ష్మి, ఎమ్మెల్ కృష్ణ, అగస్త్య, శాంతిసిరి, నాగసిరి, జరియా. అయితే వీటిలో జరియా లాంచీని గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రాప్రాంతానికి తరలించగా,  ఇక్కడ ప్రస్తుతం ఐదు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఈ ప్రాంతం కోసం మూడు లాంచీలు తీసుకోవడమే గాక,  అక్కడ పనిచేసే తెలంగాణ ఉద్యోగులను ఇక్కడికి రప్పించి, అన్ని అనుమతులు తీసుకుని హిల్‌కాలనీ నుంచి లాంచీలు ప్రారంభిస్తే పర్యాటకులకు చుట్టూ తిరిగి వెళ్లే శ్రమ తప్పుతుందని పలువురు పేర్కొంటున్నారు. జట్టీ నిర్మాణం జరగాలన్నా మరో రెండు సంవత్సరాలు పడుతుంది. అప్పుడు ప్రతి అనుమతికి ఢిల్లీ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఎట్లాగూ పర్యాటక అభివృద్ధి సంస్థ అప్పులు, లాంచీలు  రెండుప్రాంతాలవారు పంచుకోవాల్సిందేనంటున్నారు. బుద్ధపూర్ణమి ఉత్సవాలలో భాగంగా ఇక్కడి నుంచి లాంచీల ట్రయల్న్ ్రజరపాలని తెలంగాణ ప్రాంత పర్యాటకులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు