పరిమితి మించుతోంది

24 Dec, 2013 03:54 IST|Sakshi

 ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్:
 జిల్లాలో పొగాకు పంట అధిక విస్తీర్ణం దిశగా సాగుతోంది. రైతులు తొలుత ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గుచూపినా, పరిస్థితులు అనుకూలించకపోవడంతో మనసు మార్చుకొని పొగాకు సాగు చేస్తున్నారు. జిల్లాలో పొదిలి పొగాకు వేలం కేంద్రాల పరిధిలో ఇప్పటికే ముందుగా వేసిన పొగాకు ఒకటి, రెండు కొట్టుడులు కూడా అయింది. ఎర్ర నేలలు, తేలికపాటి నేలల్లో ముందుగానే సాగు చేయడం వల్ల ఆ ప్రాంతం రైతాంగానికి క్యూరింగ్ సమయం ప్రారంభమైనట్లైంది.  నల్లరేగడి నేలల్లో మాత్రం కొంత ఆలస్యంగా వేశారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో పడిన వర్షాలకు ఈ నేలలు త్వరగా ఆరకపోవడంతో ఆలస్యంగా పొగాకు సాగు చేశారు. ప్రస్తుతం ఇంకా కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేస్తూనే ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని రైతులు వారం, పది రోజుల నుంచి పొగనాట్లు వేయడం ప్రారంభించారు.
 
 ఇప్పటికే 15 వేల ఎకరాల్లో అధిక సాగు..
 పొగాకు బోర్డు నిర్ణయించిన దానికంటే అధిక మొత్తంలో రైతులు పొగాకు సాగు చేశారు.    జిల్లాలోని అన్ని ప్లాట్‌ఫారాలు, నెల్లూరు జిల్లాలోని కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలతో పాటు మొత్తం 1.85 లక్షల ఎకరాల్లో పొగాకు సాగు లక్ష్యంగా నిర్ధారించారు. అయితే లక్ష్యం దాటి 15 వేల ఎకరాల్లో ఇప్పటికే సాగు చేశారు. ఇంకా లోతట్టు ప్రాంతాల్లో సాగు కొనసాగుతూనే ఉంది.
 
 వేరే పంటల సాగుకు అనువుగా
 లేకపోవడమే..
 ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనువుగా లేకపోవడమే రైతాంగాన్ని పొగాకు సాగు వైపు మొగ్గుచూపేలా చేస్తోంది. గత ఏడాది శనగ దిగుబడే ఇంకా పేరుకుపోవడం, ఆ అప్పులు నేటికీ పీడకలలా వెంటాడటంతో ఆ పంట సాగు వైపు రైతులు ఆసక్తి చూపలేదు. దీంతో 2.82 లక్షల ఎకరాల్లో సాధారణ సాగు విస్తీర్ణం ఉన్న శనగ 60 వేల ఎకరాల్లోపే సాగైంది. మొక్కజొన్న కూడా పెద్దగా ఈ ఏడాది సాగు చేయలేదు.  జామాయిల్, సరుగుడు తోటల సాగుకు ఆస్కారం ఉన్నా..నాలుగేళ్ల వరకు ప్రతిఫలం అందదని కొంత మేర మాత్రమే సాగు చేశారు. అయినా జిల్లాలో ఈసారి లక్ష ఎకరాల్లో అదనంగానే సామాజిక వనాలు సాగయ్యాయి.

మరిన్ని వార్తలు