బేళ్ల చూపులు

23 Apr, 2020 11:33 IST|Sakshi

లాక్‌డౌన్‌తో నిలిచిన వేలం కేంద్రాలు

పొగాకు నాణ్యత, తూకం తగ్గుతుందని ఆందోళన

సాక్షి,నెల్లూరు: జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ఎక్కువ మంది రైతులకు పొగాకు సాగే ఆధారం. గత ఐదేళ్లు వర్షాభావ పరిస్థితులతో నష్టాలు మూటకట్టుకున్నారు. ఈ ఏడాది ప్రకృతి కరుణించడంతో పంట ఉత్పత్తి పెరిగింది. వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అంతలోనే కరోనా పొగాకు రైతుల పాలిట శాపంగా మారింది. లాక్‌డౌన్‌తో వేలం కేంద్రాలు మూతపడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోళ్లు ఎప్పుడు పునఃప్రారంభిస్తారో తెలియక రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మద్దతు ధర పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్‌పై అధారపడి ఉండడం ఒక వేళ వేలం ప్రారంభించినా ధరలు ఎలా ఉంటాయో అనే ఆందోళన వెంటాడుతోంది. జిల్లాలో డీసీపల్లి, కలిగిరి వేలం కేంద్రాల పరిధిలో 3,142 పొగాకు బ్యారన్లకు లైసెన్స్‌లు ఉన్నా దాదాపు 3,860 మంది రైతులు 8,098 హెక్టార్లలో పొగాకు సాగు చేశారు. ఈ ఏడాది పొగాకు బోర్డు 10.84 మిలియన్‌ కిలోల ఉత్పత్తి పొగాకు కు అనుమతి ఇచ్చింది. కానీ దాదాపు 15 మిలియన్‌ కేజీల ఉత్పత్తి జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 17న డీసీపల్లి, 26న కలిగిరి వేలం కేంద్రాలను ప్రారంభించారు. అయితే కరోనా అలర్ట్‌ నేపథ్యంలో మార్చి 21 నుంచి అన్ని వేలం కేంద్రాలు ఆపేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. 

విక్రయాలు తక్కువే
రెండు విక్రయ కేంద్రాల పరిధిలో దాదాపు 15 మిలియన్‌ టన్నుల పొగాకు ఉంది. బోర్డు అనుమతి ఇచ్చిన ఉత్పత్తి కొనుగోళ్లు పూర్తి కావాలంటే దాదాపు 3 నెలల పాటు వేలం జరగాల్సి ఉంటుంది. ఇప్పటికి డీసీపల్లిలో 4,13,854.8 కేజీల మాత్రమే కొనుగోళ్లు చేశారు. కలిగిరిలో 3,51,514 లక్షల కేజీల పొగాకును వ్యాపారులు కొనుగోళ్లు చేశారు. ఆ రెండు కలిపినా కూడా మిలియన్‌ కిలోల కొనుగోళ్లు కూడా జరగలేదు. ఇంకా 14 మిలియన్‌ కిలోల పంట ఉంది. వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ రైతుల వద్ద నిల్వ ఉండే మేలిమి రకం పంట నాణ్యత దెబ్బతింటోంది. తూకంలోనూ వ్యత్యాసం వస్తుంది. ప్రతి 150 కిలోల బేలుకు సగటున 5 కిలోల తరుగు వస్తుంది. ప్రస్తుత మార్కెట్‌తో పోల్చితే బేలుకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు  రైతు నష్టపోనున్నారు. నిల్వ ఉండే పొగాకు మండిలో కూడా వేడి వచ్చి ఆకు నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు