పొగాకు రైతు ఆత్మహత్య

11 Sep, 2015 20:25 IST|Sakshi

టంగుటూరు (ప్రకాశం) : పొగాకుకు గిట్టుబాటు ధర లేక, అప్పుల భారం పెరిగి తీవ్ర మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని పొందూరు పంచాయతీ పొదలవారిపాలెంలో శుక్రవారం ఉదయం జరిగింది. పొందూరుకు చెందిన పొగాకు రైతు బొల్లినేని కృష్ణారావు (40)కు మూడు ఎకరాల భూమితో పాటు, ఒక పొగాకు బ్యారన్ ఉంది. తన మూడు ఎకరాలతో పాటు 17 ఎకరాల పొలం, రెండు బ్యారన్లు కౌలుకు తీసుకుంటున్నాడు. గత మూడేళ్లుగా ఇదే పద్ధతిలో రెండు బ్యారన్ల పొగాకు సాగు చేస్తున్నాడు. పొగాకు దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేక మూడేళ్లుగా నష్టాలు చవిచూస్తున్నాడు. ఏటా నష్టాలు పెరిగి అప్పుల భారం మోయలేని స్థితికి చేరింది. బ్యాంకు రుణం రూ.10 లక్షలు కాగా..వడ్డీ వ్యాపారుల దగ్గర మరో రూ.10 లక్షలు అప్పు చేశాడు. ఈ ఏడాదీ బ్యారన్‌కు రూ.3 లక్షలు నష్టం తప్పేలా లేదు. పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై ఆరు నెలలు దాటినా ఇప్పటికీ తన పొగాకు దిగుబడిలో కేవలం 60 శాతమే అమ్ముకోగలిగాడు. ఇంకా 40 శాతం పొగాకు నిల్వలు ఇంట్లోనే మూలుగుతున్నాయి. ఈ ఏడాదైనా అప్పులు తీర్చలగనన్న నమ్మకం పోయింది.

అప్పులవాళ్ల ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఏం చేయలో దిక్కుతోచక కృష్ణారావు తీవ్ర ఆందోళన చెందాడు. ఇంతకాలం గుట్టుగా ఉన్న పరువు బజారున పడుతుందేమోనని భయపడ్డాడు. ఆ ఆలోచనలతోనే చివరకు తనువు చాలించాలని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామునే నిద్రలేచి నేరుగా బాత్‌రూంలోకి వెళ్లి పురుగుమందు తాగాడు. బాత్‌రూంకు వెళ్లిన భర్త బయటకు రాకపోవడంతో భార్య శారద వెళ్లి చూడగా బాత్‌రూంలో అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్న కృష్ణారావును స్థానికుల సాయంతో బయటకు తెచ్చారు. ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా..అప్పటికే అతను మృతిచెందాడు. కృష్ణారావుకు భార్యతో పాటు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా ఆత్మహత్య చేసుకున్న కృష్ణారావు కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని పొగాకు బోర్డు (ఆర్‌ఎం ) కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. మృతదేహంతో కార్యాలయ ఆవరణలోనే నిరసనకు దిగారు. కుటుంబాన్ని ఆదుకుంటామన్న ఆర్‌ఎం హామీతో ఆందోళన విరమించారు.

మరిన్ని వార్తలు