సిక్కోలు సైనికా.. సలామ్‌!

26 Jul, 2019 08:07 IST|Sakshi

కార్గిల్‌ పోరుకు నేటితో 20 ఏళ్లు పూర్తి

వీరోచిత పోరును గుర్తు చేసుకుంటున్న జిల్లా మాజీ సైనికులు

కార్గిల్‌ దివస్‌ సందర్భంగా నేడు పలు కార్యక్రమాలకు శ్రీకారం

సాక్షి, శ్రీకాకుళం న్యూకాలనీ: కార్గిల్‌ యుద్ధం.. మన దేశ సైనిక శక్తిని, వీరుల పోరాట ప్రతిభను మరోసారి చాటిచెప్పిన యుద్ధం. డిసెంబర్, జనవరి మాసాల్లోని చలి తీవ్రత, మంచు దట్టంగా కురిసే వాతావరణాన్ని ఆసరాగా తీసుకున్న ముష్కరులు.. నియంత్రణ రేఖ దాటి జమ్మూకశ్మీర్‌లోని కార్గిల్, ద్రాస్‌ సెక్టార్‌లో తిష్టవేశారు. వీరికి దాయాది దేశమైన పాకిస్తాన్‌ పరోక్షంగా, ప్రత్యక్ష అండదండలు అందించింది. వీరిని గుర్తించిన మన దేశ బలగాలు.. తరిమికొట్టేందు ప్రయత్నాలు చేశారు. పాకిస్తాన్‌ సైనికులు తీవ్రవాదులతో కలిసి ప్రతిఘటించడంతో ఇది యుద్ధంగా మలుపుతీసుకుంది. 1999  మే నుంచి జూలై నెలల మధ్య ఈ యుద్ధంలో ఎత్తయిన పర్వత శిఖరాలు, అత్యంత కఠిన పరిస్థితుల మధ్య చూపిన పోరాట ప్రతిమ, ధైర్యసాహసాలు విశేషమైనవనే చెప్పాలి. మన బలగాల ధాటికి ముష్కర మూకలు, పాక్‌ సైనికులు తోకలు ముడిచారు. కార్గిల్‌ పర్వతంపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ పోరులో వీరోచిత పోరాటంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సైనికులు సైతం కీలకపాత్ర పోషించారు.  వీరికి దేశం యావత్తు సలామ్‌ చేస్తోంది. జూలై 25 నుంచి 27 వరకు ఆపరేషన్‌ విజయ్‌ పేరిట కార్గిల్‌ గెలుపు సంబరాలు నిర్వహించేందుకు ఇండియన్‌ ఆర్మీ ఏర్పాట్లు చేసింది. నేడు కార్గిల్‌ దివస్‌ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

ఆర్మీ ప్రత్యేక సంబరాలు..
కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ 20వ వార్షికోత్సవంలో భాగంగా 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు దేశరాజధాని ఢిల్లీ నుంచి జమ్మూకాశ్మీర్‌లోని ద్రాస్‌ వరకు భారీగా గెలుపు సంబరాలకు భారత్‌ ఆర్మీ సన్నద్ధమైంది. వాస్తవానికి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక స్థూపం నుంచి ఈ నెల 14న జ్యోతి ప్రజ్వలనతో ఈ సంబరాలకు శ్రీకారం చుట్టారు. కార్గిల్‌ జ్యోతి దేశంలోని 11 నగరాల్లో కొనసాగి.. ద్రాస్‌లో కలిసి వేడుకలకు ముగింపు పలకనున్నారు. ఎత్తయిన పర్వత శిఖరాల్లో కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో క్లిష్టమైన కార్గిల్‌ యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించడం దేశానికే గర్వకారణం. ఆ  యుద్ధంలో మన సైనికులు పోరాటం ఊరికే పోలేదు. వారి స్ఫూర్తితో ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలకు భారత సైనికులు శ్రీకారం చుట్టారు. 

దేశ సేవలో సిక్కోలు గడ్డ..
గుండె ధైర్యం, సాహసంతో శత్రువుపై విరుచుపడే తత్వానికి ప్రతీక కార్గిల్‌ యుద్ధం. పాకిస్తాన్‌ సైన్యం దొంగదెబ్బ తీసిన ఆ యుద్ధంలో భారతీయ సైనికులు శత్రువులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా తరిమికొట్టారు. యుద్ధం విజయంలో భారతీయ ఇన్‌ఫాంట్రీ విభాగం సైనికులే నిజమైన హీరోలుగా గుర్తింపు పొందారు. నాటి యుద్ధంలో 524 మంది భారత సైనికులు అమరులుకాగా.. 1363 మంది గాయపడ్డారు. జిల్లా నుంచి సుమారు 18 మంది వరకు కార్గిల్‌ యుద్ధ పోరాటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములు అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 

ఒకరు వీరమరణం.. ఇద్దరికి గాయాలు..
కార్గిల్‌ యుద్ధంలో శత్రు సైన్యంతో జరిగిన భీకరపోరులో ఎదురొడ్డి నిలిచిన సిక్కోలు సైనికులు ఇప్పటికీ ఆ దృశ్యాలు వారి కళ్లముందే కనిపిస్తున్నాయని గుర్తుచేసుకుంటున్నారు. ఆనాటి భీకర పోరులో జిల్లాకు చెందిన సుబేదార్‌ చింతాడ మోహనరావు వీరమరణం పొందాడు. ఇతని స్వస్థలం పోలాకి మండలం రామయ్యవలస. కార్గిల్‌ యుద్ధ సమయంలో తీవ్ర గాయాలపాలైన మోహనరావు 1999 అక్టోబర్‌ 18న ఆస్పత్రిలో కన్నుమూశారు.  పలాస మండలం కేసిపురం గ్రామానికి చెందిన టొంప నీలాచలం (రాష్ట్రీయ రైఫిల్స్‌) 1999 జూన్‌ 21న  ద్రాస్‌ సెక్టార్‌ పైన టైగర్‌హిల్స్‌ వద్ద ప్రత్యర్ధుల భీకర ఎదురుకాల్పుల్లో కుడిచేతిలోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఇతనికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు మాత్రం పూర్తిస్థాయిలో అందలేదు. బూర్జ మండలం లక్కుపురం గ్రామానికి చెందిన చిన్ని సింహాచలం 1999 జూన్‌ 12న పాక్‌ సైనికులతో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో బుల్లెట్‌ తగిలి గాయాలపాలయ్యారు. ఈయనకు కూడా ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం పూర్తిస్థాయిలో రాలేదు.

నేడు ప్రత్యేక కార్యక్రమాలు..
ఈ సందర్భంగా కార్గిల్‌ యుద్ధంలో వీరోచితంగా పోరాటం చేసిన శ్రీకాకుళం సైనికుల పోరాట ప్రతిమను ప్రతిఒక్కరూ కొనియాడుతున్నారు. కార్గిల్‌ దివాస్‌ను గుర్తుచేసుకుంటూ శ్రీకాకుళం నగరంలో గూణపాలెం సమీపంలోని పార్క్‌ వద్ద కార్గిల్‌ విజయానికి చిహ్నంగా స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు.

►నేడు జరిగే కార్గిల్‌ దివాస్‌ సందర్భంగా శ్రీకాకుళంలో పలు కార్యక్రమాలు జరగనున్నాయి. ఎన్‌సీసీకి చెందిన 14వ ఆంధ్రా బెటాలియన్‌ విద్యార్థులు శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ప్రత్యేక పేరేడ్‌ చేయనున్నారు. అనంతరం ర్యాలీ తీయనున్నారు. 
► గూణపాలెం సమీపంలో ఉన్న కార్గిల్‌ యుద్ధ చిహ్నం వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. సైనికుల త్యాగాలను గుర్తు చేసుకోనున్నారు.
► భారతీయ జనతా పార్టీకి చెందిన పలువురు నాయకులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

ఏమిచ్చినా వారి రుణం తీరదు    
సైనికుల త్యాగాలు చేయనిదే మనం సరిగ్గా నిద్రించలేం. దేశ రక్షణలో సైనికులే మూలం. ప్రధానం కూడా. సైనికులకు ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేనిది. దేశ సైనికుల రక్షణ కోసం ప్రస్తుతం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. కార్గిల్‌ వార్‌ అనేది దేశ సైనికులకు ఒక స్ఫూర్తిదాయకం. ఆర్మీకి వెళ్లే సైనికుల్లో శ్రీకాకుళం జిల్లా వారు ఎక్కువ. జిల్లా నుంచి 6300 మంది మాజీ సైనికులు వరకు ఉన్నారు. ఇందులో 900 మంది వితంతువులు ఉన్నారు.  
– జి.సత్యానందం, జిల్లా సైనిక సంక్షేమాధికారి   

దేశానికి సైనికులే బలం    
దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సైనికులు త్యాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను కూడా అక్కడి నుంచే వచ్చాను. తల్లిదండ్రులు, భార్యాపిల్లల్ని వదిలి దేశం ప్రశాంతంగా నిద్రించడం కోసం బోర్డర్‌లో రక్షణ కాస్తున్న సైనికులే దేశానికి సైనికులే బలం. వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వాలు ఉదారభావాన్ని కలిగి ఉండాలి. కార్గిల్‌ యుద్ధ సైనికులకు నా జోహార్లు.
– తమ్మినేని కృష్ణారావు, జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షుడు 

కళ్లముందే ఆ దృశ్యాలు.. 
1999 జూన్, జూలై మాసాల్లో కార్గిల్, ద్రాస్‌ సెక్టార్లలో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో పాల్గొనడం గర్వంగా ఉంది. దేశ రక్షణలో నేను భాగస్వామున్నైనందుకు ఎప్పుడూ గర్వపడుతునే ఉంటాను. రేయింబవళ్లు యుద్ధంలో పాల్గొన్నాం. 1999 జూన్‌ 21న ప్రత్యర్థుల భీకర ఎదురుకాల్పుల్లో నా చేతిలోకి బుల్లెట్‌ దూసుకుపోయింది. చేతికి డామేజ్‌ జరిగింది. అప్పట్లో నాకు యుద్ధంలో గాయపడినందుకు లక్ష రూపాయలు మాత్రమే అందింది. ప్రస్తుతం పెన్షన్‌గా కొంతమొత్తం వస్తోంది.              – టొంప నీలాచలం, కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు

ఎన్‌సీసీకి సైనికులే స్ఫూర్తి    
నేషనల్‌ క్యాడెట్‌ కారŠప్స్‌కు సైనికులే స్ఫూర్తి. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎన్‌సీసీ క్యాడెట్లు వివిధ విన్యాసాలు చేస్తున్నారు. క్యాడెట్లకు యుద్ధ సైనికులే రోల్‌ మోడల్‌. ఎన్‌సీసీ క్యాడెట్ల అభివృద్ధి, సంక్షేమానికి  ప్రభుత్వాలు కనీస చర్యలు చేపట్టాలి. 
–డాక్టర్‌ వై.పోలినాయుడు, ఎన్‌సీసీ అధికారి,  శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల  

మరిన్ని వార్తలు