నేడో,రేపో మద్యం టెండర్లకు నోటిఫికే షన్

21 Jun, 2014 02:58 IST|Sakshi
నేడో,రేపో మద్యం టెండర్లకు నోటిఫికే షన్

నూతన మద్యం విధానం ఖరారుకు నేడు సమావేశం
జూలై 1 నుంచి షాపులను కేటాయించే అవకాశం
సమీక్ష నిర్వహించిన ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర
 తెలంగాణలో14నే నోటిఫికేషన్

 
 
ప్రొద్దుటూరు: మద్యం షాపుల టెండర్ల నిర్వహణకు సంబంధించి ఉన్నతాధికారులు నేడో రేపో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ ఎస్‌ఎస్ రావత్ శనివారం  హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నూతన మద్యం విధానాన్ని ఖరారు చేయనున్నారు. జిల్లాకు సంబంధించి మొత్తం 269 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో 80 వాటికి టెండర్లు జరగలేదు. ఎవరూ  ముందుకు రాకపోవడంతో వీటిని అలాగే వదిలేశారు. రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం టెండర్లు నిర్వహించి డిప్ విధానం ద్వారా షాపులను ఖరారు చేసింది. ఏడాదివరకే ఈ కాలపరిమితి ఉండగా ప్రభుత్వం మరో ఏడాది రెన్యూవల్ చేసి కాలాన్ని పొడిగించింది. ప్రస్తుతం రెండేళ్ల గడువు పూర్తయింది. ఈ నెలాఖరులోగా కొత్తగా టెండర్లు నిర్వహించి జూలై 1 నుంచి షాపులు కేటాయించాల్సి ఉంది. ఇందు కోసం వారం రోజుల గడువును విధించాల్సి ఉంది.

ఈ ప్రకారం నేడో రేపో నోటిఫికేషన్ వెలువడనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 14న అక్కడ నోటిఫికేషన్ వెలువడగా 21వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించారు. 23న డిప్ ద్వారా షాపులు కేటాయించనున్నారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 2న ప్రమాణ స్వీకారం చేయగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఈప్రభావం కారణంగా తెలంగాణ కన్నా మన రాష్ట్రంలో  నూతన మద్యం విధానం అమలులో జాప్యం జరిగింది. రెండు రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమేరకు కమిషనర్ శనివారం సమీక్ష నిర్వహించి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా ప్రివిలైజ్ ట్యాక్స్‌తోపాటు మున్సిపాలిటీల పరిధిలోని రెండు కిలోమీటర్ల విధానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు