విద్యుత్ షాక్

31 Mar, 2016 04:00 IST|Sakshi
విద్యుత్ షాక్

కరెంటు చార్జీల కొత్త టారిఫ్
నేడు ప్రకటించనున్న
ఏపీఈఆర్‌సీ ప్రస్తుత రేట్లపై 4 శాతం పెంపు
మూడు శాతానికి ప్రభుత్వం అనుమతించే అవకాశం

 
 సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ చార్జీల పెంపునకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ప్రతిపాదించిన ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) గురువారం నిర్ణయం ప్రకటించనుంది. ఈ ఏడాది కూడా డిస్కం ప్రతిపాదించిన దానిలో ఒక శాతం తగ్గించి చార్జీలు విధించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు విశ్వసనీయ సమాచారం.

 రూ.294.67కోట్ల ప్రతిపాదనలు
ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 52.18 లక్షల మంది వినియోగదారులున్నారు. పూర్తి వ్యవస్థను నడపడానికి డిస్కంనకు రూ.9,503.03 కోట్ల ఆదాయం అవసరం కాగా అమ్మకాల ద్వారా రూ.8,613.68 కోట్లు వస్తోంది. నాన్ టారిఫ్ ద్వారా మరో రూ.89.22 కోట్లు వస్తున్నప్పటికీ ఇంకా రూ.800.13 కోట్ల   లోటు ఉంటోంది. తాజా ప్రతిపాదన వల్ల రూ.294.67కోట్ల ఆదాయం సమకూరినప్పటికీ ఇంకా రూ.505.46 కోట్ల లోటులోనే డిస్కం ఉంటుంది.

 మూడు శాతం తప్పదు!
గత ఆర్థిక సంవత్సరంలో 6శాతం పెంచాలని కోరితే కేవలం ఒకశాతం తగ్గించి 5 శాతం చార్జీలు పెంచారు. ఈ ఏడాది గృహ విద్యుత్ వినియోగదారులకు 2.5 శాతం, ఇతర కేటగిరిలకు 4 శాతం చార్జీలు పెంచమని ప్రతిపాదించారు. దానిలో ఒక శాతం తగ్గించి 3 శాతం పెంపుదలకు ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. ఈ ఏడాది నుంచి కొత్తగా గృహ విద్యుత్ వినియోగదారులను వారి వార్షిక విద్యుత్ వినియోగం ఆధారంగా ఎ,బి,సిలుగా వర్గీకరణ చేశారు.

ఎ,బి కేటగిరిల్లో సంవత్సర వినియోగం 600 యూనిట్ల నుంచి 2,400 యూనిట్ల వరకూ ఎలాంటి చార్జీలు పెంచడం లేదు. అంతకు మించితే ‘సి’ కేటగిరిలోకి వస్తారని, వారిపై రూ.0.07పైసలు నుంచి రూ.0.22పైసల వరకూ పెంచాలని ప్రతిపాదించారు. అయితే ఈ శ్లాబులపై అభిప్రాయ సేకరణలో వినియోగదారులు, ప్రజా సంఘాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో కొత్తగా ప్రవేశపెట్టాలనుకున్న ప్రయోగానికి అనుమతి వస్తుందో, రాదోననే ఉత్కంఠ అధికారుల్లో నెలకొంది.  

 విశ్వసనీయతకు ఒప్పుకుంటుందా?
 నిరంతర విద్యుత్ సరఫరాకు రాష్ర్టంలోని విశాఖ, కాకినాడ, రాజమండ్రి, శ్రీసిటీ, కృష్ణపట్నం, తిరుపతి నగరాల్లో 33 కె.వి , హెచ్.టి వినియోగదారుల నుంచి యూనిట్‌కు రూ.0.25పైసలు విశ్వసనీయ చార్జీ వసూలు చేయాలని కూడా ఈ ఏడాది కొత్తగా ప్రతిపాదించారు. వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందో తెలియడం లేదు. ఈ చార్జీలు వసూలు చేస్తే వినియోగదారుడికి నిరంతర విద్యుత్ అందించాలి. ఏ కారణంతోనైనా అంతరాయం ఏర్పడితే అతను చెల్లించిన చార్జీతో పాటు అదనపు సొమ్మును డిస్కం అతనికి ఇవ్వాలి. ఇది కాస్త క్లిష్టమైన అంశం గనుక, ఆమోదిస్తే తర్వాత నిరంతర విద్యుత్ ఇవ్వగలమా లేదా అని ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు