తెలుగుజాతి కీర్తి ‘ప్రకాశం’

23 Aug, 2019 08:05 IST|Sakshi
టంగుటూరి ప్రకాశం పంతులు 

నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

జిల్లాతో ఆయనకు అనుబంధం

రండిరా యిదె కాల్చుకొండిరాయని నిండు
గుండెనిచ్చిన మహోద్దండ మూర్తి
సర్వస్వమూ స్వరాజ్య సమర యజ్ఞం నందు
హోమమ్మొనర్చిన సోమయాజి...
– ప్రకాశం పంతులు గురించి ప్రముఖ కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి ప్రశంస ఇది.

సాక్షి, కడప : ఆంధ్రకేసరి.. ఆ పేరులోనే ఓ దర్పం.. ఆయన వర్తనలో కూడా తెలుగు పౌరుషం.. నిరాడంబరత.. నిజాయతీ, పట్టుదల, క్రమశిక్షణ, నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ఎదురించే గుణం.. నచ్చని ఏ అంశంపైనైనా నిప్పులు చెరిగేతత్వం.. నిజాయితీకి నిలువెత్తు రూపం.. తన గుండెను తూపాకీ గొట్టానికి అడ్డుపెట్టి తెల్ల దొరలను సైతం తెల్లబోయేలా చేసిన సాహస సింహం, తెలుగు విలువల ప్రతాకం ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా కడపతో ఆయనకు గల బంధం గురించి కొన్ని వివరాలు.
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి తరానికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ జిల్లాలోని స్వాతంత్య్ర సమరయోధులు, వారి వారసులు, 80 ఏళ్లకు పైగా వయసు ఉన్న పెద్దలుకు తెలుసు. మొన్నటితరం నేత అయినా ఆయన పేరు వినగానే నిన్నటి తరానికి గర్వంతో గుండె ఉప్పొంగుతుంది. పలువురు పెద్దలు ఆయన గురించి తలుచుకుంటూ.. ప్రతి అడుగు ఓ పిడుగు అని, మాట సింహగర్జన అని, ప్రేమతో పలుకరిస్తే నవనీతంలా ఉంటుందని, ఆగ్రహిస్తే అగ్ని వర్షం కరిసినట్టే ఉంటుందని అభివర్ణిస్తూ మురిసిపోతూ ఉంటారు. వారు అందించిన సమాచారంతోపాటు జిల్లా గెజిట్‌ ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి.

జీవిత ప్రకాశం
ప్రకాశం పంతులు 1872 ఆగస్టు 23న జన్మించారు. 1957 మే 20న ఈ లోకాన్ని వీడారు. ఆయన నిరుపేద అయినా బాగా చదువుకుని న్యాయవాదిగా పని చేశారు. 1926లో స్వాతంత్య్ర ఉద్యమంలోకి ప్రవేశించారు. ‘స్వరాజ్య’ దినపత్రికను స్థాపించారు.
1942లో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రిటీషు అధికారులు ఆయనను కడపలో నిర్బంధించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఉత్తమమైన పాలన అందించారు. 1972లో ఒంగోలు జిల్లాకు ఆయనపై గౌరవ సూచకంగా ప్రకాశం జిల్లాగా మార్చారు. రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాకు ఒక నాయకుడి పేరు పెట్టడం ఆయనతోనే మొదలైంది.
కడప నగరంలోని ఏడురోడ్ల కూడలిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశాక ఆ కూడలికి ప్రకాశం సర్కిల్‌గా నామకరణం చేశారు. ఆయనపై గౌరవంతో కడప నగరం దొంగల చెరువులోని ఓ ప్రాంతానికి ప్రకాశం నగర్‌గా పేరు పెట్టారు.

కడపలో కొన్నాళ్లు....
1942లో క్విట్‌ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ప్రకాశం పంతులు తన ఎత్తుగడలో భాగంగా కొన్నాళ్లపాటు మన జిల్లాలో ఉన్నారు. అప్పటి మన జిల్లా నాయకులు కడపకోటిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, బసిరెడ్డి తదితరులతో కలిసి ఇక్కడే రాజకీయ మంతనాలు జరిపారు. బ్రిటీషు వారు కడపలోనే ఆయనను నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రకాశం పంతులు శతజయంతి ఉత్సవాలను నిర్వహించిన సందర్భంగా కడప నగరంలోని ఏడురోడ్ల కూడలిలో 1976 ఏప్రిల్‌ 20న ఆయన నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, స్థానిక నాయకులు పి.బసిరెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు, నాటి కలెక్టర్‌ పీఎల్‌ సంజీవరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు