నేడు డీఎస్సీ నోటిఫికేషన్

21 Nov, 2014 01:14 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, కాకినాడ : నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. శుక్రవారం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుండడంతో వారి ఆశలు కొత్త చిగుళ్లు వేశాయి. గత సెప్టెంబరులోనే డీఎస్సీ వెలువడుతుందని అప్పట్లో మంత్రి ప్రకటించారు. దాంతో అభ్యర్థులంతా వేలకు వేలుపోసి కోచింగ్ సెంటర్‌లలో శిక్షణ పొందారు. అయితే వారిని నిస్పృహకు గురి చేస్తూ నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఎట్టకేలకు నోటిఫికేషన్ వెలువడనుండటంతో జిల్లాలో  డీఎడ్, బీఎడ్ పూర్తిచేసిన 54 వేలమంది అభ్యర్థుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. జిల్లా కేంద్రం కాకినాడ సహా రాజమండ్రి నగరం, పలు పట్టణాల్లో ఉన్న పలు కోచింగ్ సెంటర్‌లలో 50 వేల పై చిలుకు అభ్యర్ధులు శిక్షణ పొందారు. ఇందుకు ఒకో అభ్యర్థి కోచింగ్ ఫీజు రూపంలోనే రూ.40 వేలు చెల్లించుకున్నారు. కనీసం ఇప్పటికైనా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుండడంతో అభ్యర్థులకు ఊరటనిచ్చింది.
 
 జిల్లాలో స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్‌లు, పీఈటీలు కలిపి 274 పోస్టులు, ఎస్జీటీ పోస్టులు 546 ఖాళీ ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన రేషనలైజేషన్ ప్రక్రియకు ముందు 1180 (స్కూల్‌అసిస్టెంట్‌లు, లాంగ్వేజ్ పండిట్, పీఈటీలు కలిపి 330, స్కూల్ అసిస్టెంట్‌లు 850) పోస్టులుండేవి. రేషనలైజేషన్ అనంతరం పోస్టుల సంఖ్య 820కి పడిపోయింది. ఇందులో ప్రతి పోస్టును పరిగణనలోకి తీసుకుంటే ఒక ఉద్యోగానికి సుమారు 200 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ప్రస్తుతం డీఎడ్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సైతం డీఎస్సీకి అర్హత కల్పించారు. జిల్లాలో టెట్ అర్హత సాధించిన వారు 1600 మంది, గతంలో డీఎడ్ పూర్తిచేసిన వారు 800 మంది, ఇటీవల డీఎడ్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసిన వారు 1800 మంది పోటీపడుతున్నారు.
 
 స్కూల్ అసిస్టెంట్లకు గతేడాదితో పోలిస్తే ఈసారి పోటీ ఎక్కువగా ఉంది. 2014 టెట్‌కు 22,890 మంది దరఖాస్తు చేసుకోగా 19,921 మంది హాజరయ్యారు. వారిలో 16 వేలమందికి పైబడే ఉత్తీర్ణులయ్యారు. గతంలో టెట్ లో ఉత్తీర్ణులు అయిన వారిని, కాని వారిని కలుపుకొంటే జిల్లాలో 50 వేల మందికి పైగా ఉన్నట్టు అంచనా. వీరిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ పరీక్షకు పోటీ పడే వారే 26 వేలకు మించి ఉండొచ్చని సమాచారం.  
 

మరిన్ని వార్తలు