అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రెండు ముసలి ప్రాణాలు

20 Nov, 2019 10:03 IST|Sakshi

ఇతర ప్రాంతాల్లో పిల్లలు..సొంతూళ్లలో తల్లితండ్రులు  

బంధాలను దూరం చేస్తున్న నాగరికత 

కేవలం ఫోన్లలోనే సంభాషణలు 

నగర జీవనంలో ఇరుగుపొరుగు సత్సంబంధాలు తక్కువే  

తల్లిదండ్రులను వేధిస్తున్న ఒంటరితనం

అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. అందులో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న రెండు ముసలిప్రాణాలు.. పలకరించే నాథులు లేరు.. అవసరమైతే ఆదుకునే ఆప్తులు కరువు.. పిల్లలు ఉన్నా ఎక్కడో.. ఏ దేశంలోనో, ఇతర ప్రాంతాల్లోనో ఉద్యోగాలు చేస్తూ వారి బతుకు వారిది.. వీరి బతుకు వీరిది.. ఒంటరి జీవితం.. నేడు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.. కొడుకులూ, కోడళ్లూ.. కూతుళ్లూ, అల్లుళ్లూ.. మనవళ్లు, మనవరాళ్లు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని గొప్పగా చెప్పుకుంటున్నా.. లోలోపల తమ బిడ్డలు తమతో లేకపోతిరే అనే ఆవేదన ఏదో ఒక మూలన ఆ ముసలి ప్రాణాలను తోడేస్తూనే ఉంటుంది.. ఇలా వృద్ధదంపతులు నేడు ఒంటరి పక్షులుగా మారిపోయారు.. మీరక్కడ.. మేమిక్కడ అన్నట్లుగా తల్లిదండ్రులు.. పిల్లలూ తలొకచోట ఏకాకులుగా మారి కుటుంబ వ్యవస్థ కడు దయనీయంగా మారింది. 

సాక్షి, నెల్లూరు(బారకాసు): ప్రతి ఒక్కరికి జీవితంలో వారి కుటుంబం ముఖ్య భూమిక పోషిస్తుంది. కానీ నేడు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నామైపోతోంది. ఉమ్మడి కుటుంబాలు అసలు కనిపించని పరిస్థితి. ఆర్థిక, సామాజిక స్థితిగతులు, మారిన జీవన విధానం, సంపాదన, ఉద్యోగంతో చెట్టుకొకరు.. పుట్టకొకరుగా మారారు. బంధుత్వాలు తగ్గాయి. బంధువులు దూరమవుతున్నారు. చిన్నారులు, యువత.. చదువు, ఉద్యోగాల నేపథ్యంలో తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఉండగా నేడు పల్లెల్లోనూ ఇలాంటి కుటుంబాలు చాలా కనిపిస్తున్నాయి. రెక్కలొచ్చిన పక్షుల్లా పిల్లలు విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతుండగా తల్లిదండ్రులు ఏకాకులుగా మిగిలిపోతున్నారు.
 
మారిన పరిస్థితులతో.. 
ఆర్థిక సమస్యలు కూడా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పరంగా సమస్యలు సృష్టించి మనుషులను వేరు చేస్తున్నాయి. ప్రస్తుత నాగరిక సమాజంలో రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. దీంతో ఆర్థిక వనరులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ధరల ప్రభావంతో ఖర్చులు పెరిగిపోతున్నాయి. జల్సాలు, ఉన్నతమైన జీవనం అలవడుతున్నాయి. దీంతో సంపాదనపై మోజు పెరిగింది. వృత్తిరీత్యా ఇతర ప్రాంతాలకు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళుతున్నారు. పొద్దున లేచినప్పటి నుంచి ఈ కార్యక్రమాలతో బిజీగా కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది ఇతర దేశాలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లితండ్రులు ఒంటరిగా మారడం, కుటుంబాలు విడిపోవడం జరుగుతోంది. 

ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. 
తమ పిల్లలు రూ.లక్షలు సంపాదించారని తల్లిదండ్రులు గర్వంగా చెబుతున్నారు. పిల్లలు ఎంతో ఎత్తుకు ఎదగడం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ పిల్లలు తమ వద్ద లేని తమ కుటుంబాలు ఆనందంగా ఉంటున్నాయని చెప్పేవారు చాలా తక్కువగా ఉన్నారు. సంపాదన, ఉన్నత స్థానానికి చేరడం నిజమైన ఆనందం కలిగించదని, తరచి చూస్తే అదంతా నీటిబుడగే అని చెబుతున్నారు. కన్నబిడ్డలు ఎంత ఎత్తుకు ఎదిగినా తమ కళ్ల ఎదుటే ఉంటే తల్లితండ్రులు ఆనందపడతారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో ఏడాది పొడవునా బిజీగా గడిపినా ఏదైనా పండగకు పది రోజులు వచ్చి వెళితే.. మిగిలిన 355 రోజులు ఆ జ్ఞాపకాలతో బతికేస్తున్నామని చెప్పుకుంటుంటారు. కానీ విదేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువ మంది రెండు మూడేళ్ల కొకసారి వచ్చి వెళుతుంటారు. మళ్లీ ఎప్పుడు వస్తారా అని కన్నీటితో ఎదురుచూస్తున్న తల్లితండ్రులు అనేక మంది ఉంటున్నారు. ఆదరణ లేని కొందరు తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలను సైతం ఆశ్రయిస్తున్నారు. 

ఇరుగుపొరుగుతో మాటలు కలపాలి 
గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అందరూ రచ్చబండ, వీధుల్లో కూర్చొని కష్టసుఖాలు చెప్పుకునే వారు. ఇరుగుపొరుగు వారు కలసిమెలసి జీవనం సాగించేవారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ఇరుగుపొరుగు వారితో మాటలు కరువయ్యాయి. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా జీవిస్తున్నారు. జీవితం సాఫీగా సాగాలంటే పది రూపాయలతో కాదు పది మందితో జీవితం పంచుకోవాలన్న మాట వాస్తమనేది గ్రహించాలి. అది బలపడితే కష్టసుఖాలు పంచుకునేందుకు కొంత ఆస్కారం ఉంటుంది. 

అందరూ ఉన్నా ఏకాకులే 
కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతున్న నగరంలో ఇంటి చుట్టూ పదుల సంఖ్యలో కుటుంబాలు ఉన్నా.. అగ్గిపెట్టెలాంటి గదుల్లో ఇరుక్కుపోయి జీవనం సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పండగ, పబ్బాల సమయంలో ఒకరినొకరు చూసుకునే వింత ధోరణిలో అపార్ట్‌మెంట్‌ జీవితాలు సాగుతున్నాయి. కలసి ఉన్నా కలివిడితనం తక్కువగానే ఉంటోంది. పక్కింట్లో ఏమి జరుగుతున్నా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నారంటే మానవీయ విలువలు ఎంత దిగజారుతున్నాయో అర్థమవుతోంది. ఏటా వృద్ధుల శాతం కూడా పెరుగుతోంది. వారు 2001లో 4.5 శాతం ఉండగా నేడు అది 6.0 శాతానికి చేరింది. 2050 నాటికి 30 శాతానికి చేరుతుందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక శాతం వయోవృద్ధులు ఉన్నారని అంచనాలు చెబుతున్నాయి.  

ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఒకరి విలువ ఒకరికి తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. మంచి ఉద్యోగం కోసం తల్లిదండ్రులకు దూరంగా వెళ్లిపోతున్నారు. ఇది తప్పని అనుకోకూడదు. ఎవరికైనా భవిష్యత్‌ ముఖ్యమే. అలా అని తల్లిదండ్రులను దూరం చేసుకోవడం చాలా తప్పు. లేటు వయస్సులో వారికి కావాల్సింది డబ్బు, సౌకర్యాలు కాదు. స్వాంతన కలిగించాలి. పిల్లల నుంచి వారు ప్రేమను మాత్రమే ఆశిస్తారు. అప్పుడే వారి చివరి మజిలీ ఆనందంగా సాగిపోతుంది. చాలామంది తల్లిదండ్రులు ఆ కోరిక తీరకుండానే మరణిస్తున్నారు. 
– డాక్టర్‌ శ్రీనివాసతేజ, మానసిక వ్యాధుల నిపుణుడు 

నెల్లూరు జిల్లాలో ప్రస్తుత జనాభా – సుమారు 32 లక్షలు 
2011 లెక్కల ప్రకారం జిల్లాలో జనాభా 29 లక్షలు
జిల్లాలో ఉన్న వృద్ధాశ్రమాలు – సుమారు 150 
వీరిలో వృద్ధులు – సుమారు 7 లక్షలు
ఆశ్రయం పొందుతున్న వృద్ధులు  – సుమారు 3000 మంది

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు